ఫ్లోట్‌ సీట్‌.. ఫీల్‌ గుడ్‌

10 Feb, 2018 08:36 IST|Sakshi
ఫ్లోట్‌లు

సాఫీ ప్రయాణానికి సరికొత్త పరికరం

వాహనదారుల ఆరోగ్య సమస్యలకు చెక్‌  

ఫ్లోట్‌లు రూపొందించిన నగర మిత్రత్రయం

కార్లు, బైక్‌లలోని సీట్లకు అమర్చుకునేలా డిజైన్‌

ఆధునికతను అందిపుచ్చుకుంటున్న నగర యువత నూతనఆవిష్కరణలపై ఆసక్తి చూపుతోంది. సామాజిక, ఆరోగ్య స్పృహతో అత్యాధునిక సాధనాలు కనుగొంటోంది. నగర రోడ్లపై ప్రయాణంలో తమకు ఎదురైన సమస్యల పరిష్కారానికి శ్రమించిన సిటీ మిత్రత్రయం... సాఫీ ప్రయాణానికి ఫ్లోట్‌లు రూపొందించింది. 

నగరానికి చెందిన మాధవ్‌ సాయిరామ్‌ కొల్లి, విశ్వనాథ్‌ మల్లాది, సంతోష్‌కుమార్‌ సామల సూరత్‌లోని ఎన్‌ఐటీలో బీటెక్‌ (మెకానికల్‌) పూర్తి చేశారు. అక్కడ స్నేహితులైన వీరు స్టార్టప్‌ ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. 2015లో చదువు పూర్తయ్యాక సిటీకి వచ్చి ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగంలో చేరారు. అయితే సిటీ రోడ్లపై ప్రయాణం వారిని ఆలోచనలో పడేసింది. చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలుసుకున్నారు. 70 శాతం మంది ‘కంఫర్ట్‌’ జర్నీ చేయలేకపోతున్నారని వీరి అధ్యయనంలో తేలింది. దీనికి పరిష్కారం కనుగొనాలని ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పి ‘ఫీల్‌ గుడ్‌ ఇన్నోవేషన్‌’ స్టార్టప్‌కు అంకురార్పణ చేశారు.  

అనూహ్య స్పందన..  
డ్రైవింగ్‌ సమయంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలను అధిగమించేలా ‘ఫ్లోట్‌’లను రూపొందించారు వీరు. వీటిని కార్లు, బైకులలోని సీటుపై అమర్చుకుంటే హాయిగా ప్రయాణం చేయొచ్చని చెబుతున్నారు. ‘నగర రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడితే గంటలకొద్దీ నిరీక్షించాలి. సుదూర ప్రయాణం చేసే సందర్భాల్లో వెన్నునొప్పి సమస్యలు వస్తాయి. రక్తప్రసరణ జరగక తిమ్మిర్లు ఏర్పడతాయి. వీటన్నింటి నుంచి గట్టెక్కించేందుకు అతి చౌక ధరకే ఫ్లోట్‌లు తయారు చేశామ’ని చెప్పారీ మిత్రులు. ‘ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఐక్రియేట్‌ స్టార్టప్‌ల కార్యక్రమంలో నగరం నుంచి మేం ఒక్కరమే పాల్గొన్నాం. ప్రధాని మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మా ఐడియాకు మెచ్చుకున్నారు. మా ప్రొడక్ట్స్‌కు నగర వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 1500 ఆర్డర్లు వచ్చాయి. కావాల్సినవారు https://www.fueladream.com/  వెబ్‌సైట్‌లో సంప్రదించొచ్చు.

పనిచేస్తుందిలా...  
‘గాలి ప్రసరణ జరిగి రైడర్‌కు హాయిని కలిగించేంచేలా ప్యూర్‌ లెదర్‌తో తయారు చేసిన ఫ్లోట్‌ బ్రీతబుల్‌ మెషిన్‌లో ఎయిర్‌ ప్యాకెట్‌లు ఉండేలా చూశాం. ఇవి ఒకదానికొకటి అనుసంధానంగా ఉండటంతో లోపల ఎయిర్‌ ప్యాకెట్లలో గాలి కదలాడుతుంటుంది. అవసరాన్ని బట్టి 30–70 శాతం మేర గాలి నింపుకొని బైక్, కార్లకు సీటుగా ఉపయోగించుకోవచ్చు. తొలుత 10వేల కిలోమీటర్లు పరీక్షలు చేశాం. అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సహకారాన్ని తీసుకున్నాం. సత్ఫలితాలు వచ్చాకే మార్కెట్లోకి వచ్చామ’ని వివరించారు. 

మరిన్ని వార్తలు