మానవత్వాన్ని చాటుకున్న న్యాయమూర్తి

1 Jul, 2017 11:10 IST|Sakshi
మానవత్వాన్ని చాటుకున్న న్యాయమూర్తి

► గుండెనొప్పితో కిందపడిన నిందితుడు
► జైలుకు కాకుండా ఆస్పత్రికి తరలించాలని ఆదేశం


హైదరాబాద్‌: కోర్టులో ముద్దాయిలకు శిక్ష వేసే న్యాయమూర్తులకు గుండె కటువుగా ఉంటుందంటారు. వారు న్యాయన్యాయల గురించి మాత్రమే ఆలోచిస్తారని చాలా మంది నమ్మకం. కానీ వారిలో కూడా సున్నిత మనస్తత్వం ఉంటుంది. ఎదుటి వారికి ఏదైనా జరిగితే చలించే గుణం ఉంటుంది. సరిగ్గా అలాంటి సంఘటన హైదరాబాద్‌నాంపల్లి సిటీ సివిల్‌ కోర్టులో జరిగింది. కేసు విచారణలో ఉన్న సమయంలో గుండెనొప్పితో కిందపడిపోయిన ఓ నిందితుడిని ఆస్పత్రికి తరలించాలని ఆదేశించి ప్రాణాలు నిలిపారు.

వివరాల్లోకి వెళ్తే నాంపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అష్రఫ్‌(70)కు మోజంజాహీ మార్కెట్‌లో షాలిమార్‌ వీడియో క్యాసెట్‌ దుకాణం ఉంది. ఈ దుకాణంలో వాటాల కోసం అతని తమ్ముడి భార్య షమీనా భాను ఈ ఏడాది ఫిబ్రవరి 24న బేగంబజార్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అష్రఫ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి శుక్రవారం 17వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ బి. శ్రీనివాస్‌రావు ఎదుట హాజరుపరిచారు. దీంతో అతడిని రిమాండ్‌కు తరలించాలని మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో అకస్మాత్తుగా నిందితుడు గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాలని మేజిస్ట్రేట్‌ పోలీసులను ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు పోయేవని వైద్యులు చెప్పారు. సకాలంలో స్పందించిన న్యాయమూర్తికి అష్రఫ్‌ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించిన న్యాయమూర్తి సమయస్ఫూర్తికి అక్కడున్న వారంతా చలించిపోయారు.

మరిన్ని వార్తలు