‘వాట్సప్‌’లోకి పౌరసరఫరాల శాఖ

21 Jan, 2017 00:53 IST|Sakshi
‘వాట్సప్‌’లోకి పౌరసరఫరాల శాఖ

త్వరలో ప్రత్యేక నంబర్‌ ద్వారా రేషన్‌ ఫిర్యాదుల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. గ్రామ స్థాయిలో జరిగే ఏ చిన్న అక్రమానికి సంబంధించిన సమాచారమైనా ప్రధాన కార్యాలయానికి చేరే లా ప్రత్యేక వాట్సప్‌ నంబర్‌ను త్వరలో ప్రకటించనుంది. మండల స్థాయి నిల్వ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, సరుకుల తరలింపు లారీలకు జీపీఎస్‌ పరికరాలు, బయోమెట్రిక్‌ విధానం, సోషల్‌ మీడియా ద్వారా రేషన్‌ ఫిర్యాదుల స్వీకరణ వంటి చర్యలు తీసుకుంటోంది.

అక్రమాల అడ్డుకట్టే ఏకైక లక్ష్యం..: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 196 కోట్ల సబ్సిడీని భరించి 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేస్తోంది. అయితే రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడం ఆనవాయితీగా మారింది. ఈ జాడ్యానికి చరమగీతం పాడేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సరుకులు మార్గమధ్యంలో దారిమళ్లకుండా వెహికిల్‌ ట్రాకింగ్‌ కోసం 1,150 ట్రక్కులకు జీపీఎస్‌ పరికరాలు అమర్చారు. జీపీఎస్, సీసీటీవీలు, సోషల్‌ మీడియాను పరిశీలించడానికి వీలుగా పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల కార్యాలయాలకు అనుసంధానిస్తున్నారు.

మరిన్ని వార్తలు