గీత దాటితే అంతే...

12 Jan, 2016 03:31 IST|Sakshi

♦ నేటి నుంచి జీహెచ్‌ఎంసీలో నామినేషన్ల సందడి
♦ నిబంధనల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
♦ అతిక్రమిస్తే నామినేషన్ల తిరస్కరణ ఖాయం
 
 సాక్షి, సిటీబ్యూరో
 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  నామినేషన్ల పర్వం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ జారీతోపాటు నామినేషన్ల స్వీకరణ కూడా మంగళవారమే ప్రారంభం కానుంది. జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు రిటర్నింగ్ అధికారులు దీనికి సంబంధించి పబ్లిక్‌నోటీసు జారీ చేస్తారు. ఇక అధికారులు ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. ఏమాత్రం ఉల్లంఘనలు జరిగినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని హెచ్చరిస్తున్నారు.

 
 ఇవీ నామినేషన్ల నిబంధనలు
 
► 150 డివిజన్లకుగాను 150 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు.
► నామినేషన్లు స్వీకరించే సమయం ఉ. 11 గం॥నుంచి మ. 3 వరకు
► ఒక డివిజన్‌కు ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు
 చేయవచ్చు. ఒక నామినేషన్‌కే డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.
► జీహెచ్‌ఎంసీలోని ఏ వార్డులోనైనా ఓటరు జాబితాలో పేరున్న వారే పోటీకి అర్హులు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయం నుంచి పొందిన
 ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
► అభ్యర్థిని ప్రతిపాదించే వారికి సైతం ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతిపాదించేవారు వార్డులో ‘స్థానికుడై’ ఉండాలి.
► ఎస్సీ, ఎస్టీ, బీసీలు కులధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి.
► నామినేషన్‌తో పాటు రూ. 20 స్టాంపు పేపర్‌పై తమ విద్యార్హతలు తదితర వివరాలతో అఫిడవిట్ సమర్పించాలి.
► ఏరోజుకారోజు అందిన నామినేషన్లు, అభ్యర్థుల అఫిడవిట్లను సాయంత్రం వేళ నోటీసుబోర్డులో ప్రదర్శిస్తారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్లోనూ పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
► ఎన్నికల్లో  పోటీచేయనున్న అభ్యర్థులు నామినేషన్‌కు ఒక రోజు ముందే ఎన్నికల ఖర్చు నిర్వహణ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాలి.  ఖాతా వివరాలను రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా తెలపాలి.
 
 వీరు అనర్హులు
► అవినీతి కేసుల్లో శిక్ష పడిన వారు, ఎన్నికల్లో నేరాలకు పాల్పడి శిక్షలు పడిన వారు ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులు.
► ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అర్హులు కారు.
► జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన ఏదేని పన్నుకు సంబంధించిన నోటీసు అంది, నిర్ణీత గడువు ముగిసేలోగా పన్ను కట్టనివారు అర్హులు కారు.
 
డిక్లరేషన్ తప్పనిసరి
► ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వార్డుల్లో పోటీచేసే ఆయా కేటగిరీల అభ్యర్థులు నామినేషన్ ఫారంతోపాటు ఫారం-2తో డిక్లరేషన్ ఇవ్వాలి.
► అందుకు అనుగుణంగా అధీకృత అధికారి జారీ చేసిన కులధ్రువీకరణ పత్రం పొందుపర్చాలి.
► నామినేషన్‌తో పాటు రూ.5 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు  అందులో సగం అంటే రూ. 2500 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మొత్తాన్ని రిటర్నింగ్ అధికారికి నగదు రూపంలో గానీ, ఎస్‌బీహెచ్ శాఖల్లో చలానా రూపంలో గానీ, ట్రెజరీ ద్వారా కానీ చెల్లించవచ్చు.
► జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొలిసారిగా‘నోటా’ను అమలు చేయనున్నారు.
► గ్రేటర్ లోని 150 వార్డుల ఎన్నికలకు సంబంధించిన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు సంబంధిత సర్కిళ్లలో ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు