అనవసర ‘కోత’లపై పంజా!

6 Apr, 2017 02:01 IST|Sakshi
అనవసర ‘కోత’లపై పంజా!

సిజేరియన్ల నియంత్రణకు ‘క్లినికల్‌’ చట్టం
- కొత్త చట్టం ఆమోదం నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు
- అసుపత్రులకు గ్రేడులు.. ఏకీకృత ఫీజులు
- వైద్య చికిత్సలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచేలా రూపకల్పన
- చట్టం అమలుపై ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులతో త్వరలో సమావేశం


సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న అనవసర సిజేరియన్‌ ఆపరేషన్లపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పంజా విసరనుంది. దేశంలో తెలంగాణలోనే అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నాయని వెల్లడైన నేపథ్యంలో వాటిని నియంత్రించాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో ఆమోదం పొందిన ‘క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని’ ఆధారం చేసుకొని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులను దారిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. చట్టం ప్రకారం రోగుల హక్కులను కాపాడేలా ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు త్వరలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేకాధికారిని నియమించి, జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తారు. తర్వాత చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ అమలు చేస్తారు.

మొత్తం వివరాల సేకరణ..
రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎన్ని జరుగుతున్నాయి, ఆరోగ్యశ్రీని, వివిధ ఆరోగ్య బీమాలను దుర్వినియోగం చేయడం ద్వారా అనవసర శస్త్రచికిత్సలు ఎన్ని చేస్తున్నారు.. వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. జిల్లా మొదలు రాష్ట్రస్థాయి వరకు ఫిర్యాదులున్న ఆసుపత్రుల జాబితాను కూడా తయారు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే తమ ఆసుపత్రుల్లో జరిగిన శస్త్రచికిత్సలు, ఇతరత్రా సమగ్ర సమాచారం కోరుతూ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్యశాఖ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

ఫీజుల నియంత్రణ.. ఆన్‌లైన్‌లో రిపోర్టులు
ప్రత్యేకాధికారిని నియమించిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌), ఆరోగ్యశ్రీ మాదిరిగా ఏకీకృత ఫీజులను ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఆసుపత్రులను గ్రేడులుగా విభజించి.. గ్రేడుల వారీగా ఫీజులను నిర్ధారిస్తారు. ఈ మేరకు ఒకే గ్రేడ్‌ ఉన్న ఆసుపత్రులన్నింటి లోనూ ఏకీకృత ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుంది. చికిత్సకయ్యే ఖర్చుల జాబితాను ఆసుపత్రి ముందు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి.

ప్రతీ రోగి వివరాలను, అతనికి అందిన శస్త్రచికిత్స వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ఏదైనా చికిత్స చేయాల్సి వస్తే దానికి సరైన కారణం చెప్పాలి. వైద్యుడు తప్పు చేసినా సంబంధిత ఆసుపత్రి కూడా బాధ్యత వహించాలి. ఉదాహరణకు నిఖిల్‌ రెడ్డికి ఎత్తు పెంచే ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌పైనే చర్య తీసుకున్నారు. ఈ ప్రస్తుత చట్టంతో సంబంధిత ఆసుపత్రిపైనా చర్య తీసుకోడానికి అవకాశం కల్పించారు. వీటిని అమలు చేసేందుకు త్వరలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది.

విపరీత ధోరణులకు ముకుతాడు
ప్రైవేటు వైద్య రంగంలో వ్యాపార విపరీత ధోరణులకు ఈ చట్టం ముకుతాడు వేయనుంది. వృత్తికి ఇబ్బంది లేకుండా వ్యాపార ధోరణులను ఇది అరికడుతుంది. అనవసర ఆపరేషన్లను అడ్డుకోవడానికి వీలుకలుగుతుంది.
    – డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్, రిటైర్డ్‌ డీఎంఈ

మరిన్ని వార్తలు