లక్షకు చేరువలో ‘పోలీస్’ దరఖాస్తులు

20 Jan, 2016 03:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వారం వ్యవధిలోనే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ‘లక్ష’కు చేరువైంది. పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో 9,281 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో అందుకు అనుగుణంగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈనెల 11 నుంచి ఆన్‌లైన్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుండటం తెలిసిందే. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అభ్యర్థుల నుంచి కాస్త తక్కువగా దరఖాస్తులురాగా గత రెండ్రోజుల్లో మాత్రం ఏకంగా 30 వేల మంది చొప్పున అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మంగళవారం రాత్రికి దరఖాస్తుల సంఖ్య దాదాపు లక్షకు చేరువైంది. మరోవైపు దరఖాస్తుల్లో తప్పులు దొర్లుతున్నట్లు అధికారులు గుర్తించారు.

చాలా మంది అభ్యర్థులు స్కాన్ చేసిన ఫొటోలను మాత్రమే పొందుపరిచి, సంతకం చేయడం మరిచిపోతున్నారని, ఇలా అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు తమ వెబ్‌సైట్ హోంపేజీపై ‘సంతకం తప్పనిసరి’ అనే సూచనను రిక్రూట్‌మెంట్ బోర్డు పొందుపరిచింది. దరఖాస్తు విధానంలో ఎలాంటి తప్పులు దొర్లినా, అందుకు అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లలో తెలుగు, ఆంగ్లంలోనే సూచనలు ఉండగా ఉర్దూ మీడియం అభ్యర్థుల కోసం ఉర్దూలోనూ వాటిని పొందుపరిచారు.

మరిన్ని వార్తలు