జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

28 Apr, 2016 17:54 IST|Sakshi
జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే అధికార పార్టీలో చేరతారని సొంత పార్టీ శ్రేణులే కామెంట్లు చేస్తుండటంపై సీఎల్పీ నేత జనారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను టీఆర్ఎస్ లోకి వెళుతున్నాననే వార్తలు పీసీసీ ఆఫీస్ బేరర్లే రాయించారని మండిపడ్డారు. తనపై నమ్మకం లేకుంటే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటానన్నారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ భేటీలో జానారెడ్డి ప్రసంగం.. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను కలవరపాటుకు గురిచేసింది.

'పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సీఎల్పీ నేతగా నేను వెంటనే ఖండిస్తా. అలాంటిది చాలా రోజులుగా నాపై సాగుతోన్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ ఖండించలేదు. నేను టీఆర్ఎస్ లో చేరుతానంటూ వచ్చిన వార్తలను ఉత్తమ్ కుమార్ ఖండించి ఉండాల్సింది. నిజానికి పీసీసీ ఆఫీస్ బేరర్లే ఆ వార్తలు రాయించారు. నా నాయకత్వంపై నమ్మకం లేకుంటే చెప్పండి.. సీఎల్పీ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటా' అని జానారెడ్డి ఎమ్మెల్యేలతో అన్నారు.

ఒక్కసారిగా సీఎల్పీ నేత అలా మాట్లాడటంతో విస్తుపోయిన ఎమ్మెల్యేలు.. క్షణాలపాటు బిత్తరపోయి, వెంటనే తేరుకున్నారు. 'మీరే మా నాయకుడిగా ఉండాలి' అని మూకుమ్మడిగా జనారెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ఇవ్వాలనుకున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆలస్యం అవుతుండటంపై సీఎల్పీ చర్చించింది. వీలైనంత తొందరగా ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు పూర్తిచేయాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సమావేశానికి హాజరైనవారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, పద్మావతి, జీవన్ రెడ్డి, భాస్కర్ రావు, సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు