సీఎం బ్లాక్ వద్ద విపక్షాల మెరుపు ధర్నా

8 Aug, 2015 03:08 IST|Sakshi
సీఎం బ్లాక్ వద్ద విపక్షాల మెరుపు ధర్నా

లెఫ్ట్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, లోక్‌సత్తా నేతల అరెస్ట్  
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, లోక్‌సత్తా నేతలు సచివాలయంలోని సీఎం అధికారిక కార్యాలయం సమతా బ్లాక్ ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమ్మె సహా ఇతర ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సీఎం అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వనందుకు నిరసనగా సచివాలయంలో బైఠాయించారు.

మున్సిపల్  కార్మికులసమ్మెను పరిష్కరించాలి, సీఎం కేసీఆర్ వెంటనే చర్చలకు పిలవాలి, రైతు ఆత్మహత్యలు, ప్రజాసమస్యలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే ని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు పల్లా వెంకటరెడ్డి, రవీంద్రకుమార్, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ నేతలు కె. శివకుమార్, కొండా రాఘవరెడ్డి, బీష్వ రవీందర్‌లతోపాటు వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), జానకిరాములు, గోవింద్ (ఆర్‌ఎస్‌పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), దయానంద్, నరేందర్ (ఫార్వర్డ్ బ్లాక్), భూతం వీరయ్య (సీపీఐ-ఎంఎల్), రామ్మోహనరావు (లోక్‌సత్తా) తదితరులను అరెస్ట్ చేసి గాంధీభవన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి, న్యూడెమోక్రసీ నేత వి.వెంకటరామయ్య తదితరుల మధ్య తోపులాట జరిగింది.

దీంతో వారు సీఎం డౌన్ డౌన్, కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి.. అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు మఖ్దూం భవన్  నుంచి అఖిలపక్ష నేతలు బయలుదేరి సచివాలయం గేటు వద్దకు చేరుకున్నారు. సీఎం అపాయింట్‌మెంట్ లేదు కాబట్టి అనుమతించబోమని అక్కడున్న పోలీసులు వారిని నిలిపివేశారు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం జరిగాక, ఈ నేతలు వారిని తోసుకుని సచివాలయం ‘సీ’ (సీఎం బ్లాక్) బ్లాక్ ఎదుటకు చేరుకోగా అక్కడ వారిని ఆపేశారు. సీఎం ఎప్పుడు సమయం ఇచ్చినా అప్పటివరకు తాము వేచి ఉంటామని వారు పోలీసులకు చెప్పారు. దీనిపై చర్చ జరుగుతుండగానే వారంతా రోడ్డుపై బైఠాయించారు.
 
ఇదేం ప్రజాస్వామ్యం..: విపక్షాల నేతలు
సమస్యలపై మాట్లాడేందుకు సీఎంను కలుద్దామని వస్తే రోడ్డుపైనే ఆపేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం, ఇదేమి పాలన అంటూ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. తెలంగాణ పరిపాలన ఇలానే సాగించదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. నెలరోజులకు పైగా సమ్మె చేస్తూ పేద మున్సిపల్ కార్మికులు కష్టాల్లో ఉంటే సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్ కార్మికులు, ఇతర కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సమయమివ్వాలని అన్ని పార్టీలు లేఖ రాస్తే సీఎం కేసీఆర్ నుంచి ఏ స్పందన లేదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి చెప్పారు.

గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమ్మెలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసి దానిని నిలబెట్టుకోలేదన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజలెవరినీ సీఎం కలవకపోవడం ఏమిటని వైఎస్సార్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. తాము కూడా ఉద్యమాలు చేశామని, ఇటువంటి పద్ధతిని ఎక్కడా చూడలేదన్నారు.

అనంతరం పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ 14 నెలల పాలనలో సీఎం కేసీఆర్ ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ నేత కె.శివకుమార్ ధ్వజమెత్తారు. ఒకవైపు ఉద్యోగాలిస్తామంటూ, సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎంగా ఉండగా ప్రజలను కలుసుకునేందుకు రోజూ పొద్దున సమయమిచ్చినట్లుగా సీఎం కేసీఆర్ కూడా సమయమివ్వాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు