కజకిస్తాన్‌కు, ఏపీకి సారూప్యతలు

10 Jul, 2016 01:29 IST|Sakshi
కజకిస్తాన్‌కు, ఏపీకి సారూప్యతలు

- సీఎం చంద్రబాబు వ్యాఖ్య
- కజకిస్తాన్ చేరుకున్న సీఎం బృందం
 
 సాక్షి, హైదరాబాద్ : కజకిస్తాన్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు అనేక సారూప్యతలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అస్తానా మాజీ మేయర్, కజకిస్తాన్ ప్రస్తుత రక్షణ మంత్రి ఇమంగలి తస్తాంగబేవ్‌తో సీఎం శనివారం కజకిస్తాన్‌లో భేటీ అయ్యారు. కజకిస్తాన్ సోవియట్ రష్యా నుంచి వేరుపడిందని, ఏపీ కూడా విభజించిన రాష్ట్రమని చెప్పారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రపంచం మొత్తం మీ గురించే మాట్లాడుకునే స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. అందుకే తమ ప్రధాని కజకిస్తాన్‌ను సందర్శించి రావాలని చెప్పారన్నారు. ముఖ్యమంత్రి బృందం శనివారం సాయంత్రం కజకిస్తాన్‌కు చేరుకుంది.అల్మాటిలో దిగిన సీఎం బృందం అక్కడి నుంచి కోక్‌టోబ్‌కు కేబుల్ కార్‌లో వెళ్లిన చంద్రబాబు తదితరులు పర్వత ప్రాంత పర్యాటక క్షేత్రాన్ని సందర్శించారు. ఏపీలో అలాంటి పర్యాటక ప్రాంతం అభివృద్ధికి గల అవకాశాలపై బాబు ఆరా తీశారని ఏపీ ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం తెలిపింది.

 నిర్మాణం సులభమే..
 కజకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ పక్కా ప్రణాళికలు ఉంటే నవీన నగరాలను నిర్మించడం సులభతరమేనన్నారు. అస్తానా నుంచి కూడా ఆర్కిటెక్టులను పిలిపించుకోవాలని, వారి అనుభవాలు ఉపయుక్తంగా ఉంటాయని బాబుకు తస్తాంగబేవ్ సూచించారు. అంతకుముందు కజకిస్తాన్‌లో ఇంధన, చమురు, ఆర్థిక, మీడియా, నిర్మాణ, ఔషధ పరిశ్రమ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వొర్డమేసి గ్రూప్ చైర్మన్ డిన్ముఖమెట్ ఇడ్రిసోవ్‌తో బాబు సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు