‘అందరికీ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ చూపిస్తా’

27 Dec, 2016 16:36 IST|Sakshi
‘అందరికీ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ చూపిస్తా’

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి నివాసం గురించి చులకనగా మాట్లాడటం సరికాదని, అందరికీ క్యాంపు కార్యాలయం చూపిస్తానని సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం నివాసం కేసీఆర్‌ది కాదని, తెలంగాణ ప్రజల ఆస్తి అని అన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం క్యాంప్‌ కార్యాలయంపై వస్తున్న విమర్శలపై కేసీఆర్‌ మాట్లాడుతూ...తాము ఇప్పటివరకూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కట్టించిన సీఎం క్యాంపు ఆఫీస్‌లోనే ఉన్నామని, అయితే పార్కింగ్‌ సదుపాయం లేదన్నారు.

అందుకే  ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగానే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నిర్మించామన్నారు.  తన తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు ఇక్కడే ఉండవచ్చని అన్నారు. క్యాంప్‌ కార్యాలయంలో 150 గదులు ఉన్నాయనటం అవాస్తవమని, ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు మానుకవాలని కేసీఆర్‌ సూచించారు. అందరికీ క్యాంపు కార్యాలయాన్ని చూపిస్తామని కేసీఆర్‌ తెలిపారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం వ్యవహారంలో గందరగోళం జరిగిందని కేసీఆర్‌ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై సీఐడీ విచారణ వేగవంతం చేసినట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో గతంలో ఉన్న రాజకీయ జోక్యాన్ని తొలగించామని, ఎమ్మెల్యేలకు గ్రామాలను ఎంపిక చేసే అధికారం ఉంటుందన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్‌ను ఆయనే పోగొట్టుకున్నారన్నారు.