పడకేసిన ‘రెండు పడకలు’

2 Apr, 2017 03:15 IST|Sakshi
పడకేసిన ‘రెండు పడకలు’

- హరీశ్, తుమ్మల, ఈటల, జగదీశ్‌ ఇలాఖాల్లోనే వేగంగా పనులు
- మిగతా మంత్రుల తీరుపై సీఎం ఆరా


సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక రెండు పడకల గదుల ఇళ్ల పథకం చాలా మంత్రుల ఇలాఖాల్లో బాలారిష్టాలు వీడడంలేదు. నలుగురు మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రం అమాంతం వేగం అందుకుని గృహప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్లను గరిష్ట సంఖ్యలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయక తప్పని పరిస్థితి నెలకొన్న కీలక దశలోనూ పనులు పడకేసి కనిపిస్తున్నాయి. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం లాభదాయకం కాకపోవటంతో కాంట్రాక్టర్లు మొహం చాటేస్తున్న తరుణంలో కొన్ని చోట్ల వేగం అందుకోవటానికి ఆయా జిల్లాల మంత్రుల చొరవే కారణంగా కనిపిస్తోంది.

ఇలా పనులు పట్టాలెక్కి చకచకా పూర్తి అయ్యేలా చూడడంలో కేవలం నలుగురు మంత్రులకే పాస్‌ మార్కులు దక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ ఇళ్లు కీలక భూమిక పోషించే పరిస్థితి ఉండటంతో కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణను సవాల్‌గా స్వీకరించి నలుగురు మంత్రులు ముందడుగు వేస్తుంటే మిగతావారు పెద్దగా చొరవ చూపటం లేదని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఏయే జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం ఊపందుకుందో వివరాలు తెప్పించుకున్నారు. ఇందులో కేవలం నలుగురు మంత్రుల ఇలాఖాల్లోనే సానుకూల అంకెలు కనిపిస్తుండగా, చాలా మంది మంత్రుల జిల్లాల్లో సున్నాలు వెక్కిరిస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ రెండు పడక గదుల ఇళ్లు సిద్ధమయ్యేలా చూస్తున్నారన్న విషయం సీఎం దృష్టికి వెళ్లింది.

వారి ఇలాఖాల్లో పనులు చకచకా
ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేటల్లో 568 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. ఇవి పోను సిద్దిపేట జిల్లా పరిధిలో మరో 7 వేల ఇళ్లు వేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇందులో మంత్రి హరీశ్‌రావు చొరవే ముఖ్యమైంది. ప్రతి వారం కాంట్రా క్టర్లతో చర్చిస్తూ వారిని చైతన్య పరచడం మంచి ఫలితాలని స్తోంది. ఇక్కడ త్వరలో 500 ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం కాబోతున్నాయి. ఆ తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాఖాలో ఇళ్ల నిర్మాణం వేగం అందుకుంది. ఖమ్మం జిల్లా పరిధిలో 1,404 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.

ఇందులో ఉగాది రోజు 22 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. త్వరలో మరో 200 ఇళ్లు సిద్ధం కాబోతున్నాయి. సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పనులు వేగంగా సాగుతున్నా యి. ఇందులో ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలోని కొంతభా గంలో ఇళ్ల నిర్మాణ బాధ్యత ఆర్‌ అండ్‌ బీ పరిధిలో ఉంది. దీంతో రోడ్లు నిర్మించే కాంట్రాక్టర్లను పిలిపించి మంత్రి తుమ్మల తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఆ శాఖను పర్యవేక్షిస్తుండటంతో వారిలో చాలామంది ఇళ్ల పనులు చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇక సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా పనుల్లో ఇటీవల చొరవ పెంచారు. ఆయన జిల్లాలో ప్రస్తుతం 470 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా వాటిల్లో 192 ఇళ్లు దాదాపు సిద్ధమయ్యాయి.

మే 21న వాటి గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లా కరీంనగర్‌లో కూడా పనులు ఊపందుకున్నాయి. అక్కడ 225 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండగా గృహప్రవేశానికి దాదాపు 55 ఇళ్లు సిద్ధమయ్యాయి. ఇక వరంగల్‌ పట్టణంలో 1,484 ఇళ్లు, మహబూబ్‌నగర్‌ పట్టణంలో 1,334 ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా ఈ రెండూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేక చొరవతో మంజూరు చేసి సమీక్షిస్తున్నవే కావటం విశేషం. ఇవి పోనూ మరేమంత్రి ఇలాఖాల్లోనూ ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం కాలేదు. వారు కాంట్రాక్టర్లతో చర్చించి చొరవ చూపకపోవటమే దీనికి కారణమంటూ స్వయంగా అధికారులు ఆరోపిస్తున్నారు. మిగతా మంత్రుల్లాగా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రారని తేల్చి చెబుతున్నారు.

మరిన్ని వార్తలు