కాళేశ్వరంలో కాల్వలే ముందు

29 May, 2017 02:58 IST|Sakshi
కాళేశ్వరంలో కాల్వలే ముందు
బ్యారేజీ, పంప్‌హౌస్‌లు పూర్తయ్యేలోగా కాల్వలు నిర్మించాలి
- అందుకు ప్రత్యేక చొరవ చూపండి: ఎమ్మెల్యేలకు సీఎం సూచన
దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించండి
భగీరథ పనుల పురోగతిపై దృష్టి పెట్టండి
గ్రేటర్‌ వరంగల్‌ గ్రామాలకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో కాల్వల నిర్మాణం, మరమ్మతులపై ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయ్యేలోగా కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని, ఈ విషయంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకంలో లేక ఫీడర్‌ చానళ్లు, పంట కాల్వలు పూడుకుపోయాయని చెప్పారు. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఏ పనులు అవసరమో గుర్తించి, వాటిని అధికారులతో చేయించాలన్నారు.

రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక ప్రాజెక్టులు కడుతున్నామని, వాటి ద్వారా నీరందించాల్సింది కాల్వలే కాబట్టి అవి ముందుగా సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. బ్యారేజీల నిర్మాణం కన్నా ముందే పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలున్నాయని, కాబట్టి కాల్వలు సిద్ధంగా ఉంటే చెరువులు నింపుకోవచ్చని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమ య్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, కోనేరు కోనప్ప, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, పువ్వాడ అజయ్, స్టీఫెన్‌ సన్, సుధీర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రేఖా నాయక్, బాబురావు రాథోడ్, సాయన్న, హైదరాబాద్‌ మేయర్‌  రామ్మోహన్, వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ ఇందులో పాల్గొన్నారు.
 
‘భగీరథ’పై దృష్టి పెట్టండి
తమ నియోజకవర్గాల పరిధిలో మిషన్‌ భగీరథ పనులపై కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నియోజకవర్గానికి నీళ్లందించే ఇన్‌టేక్‌ వెల్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, పంప్‌హౌస్‌లు, సబ్‌స్టేషన్లు, పైప్‌లైన్ల నిర్మాణ పురోగతి? తదితర అంశాలను గమనించాలన్నారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటే పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని, గ్రామాల్లో వాటర్‌ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సూచించారు.
 
ఆ 42 గ్రామాలకూ గొర్రెల పథకం
గ్రేటర్‌ వరంగల్‌లో విలీనమైన 42 గ్రామాల్లో కూడా గొర్రెల పంపిణీ పథకంలో యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, వరంగల్‌ నగర పరిధిలో చేరిన గ్రామాలు అవకాశం కోల్పోయాయని ఆ జిల్లా మేయర్‌ నన్నపునేని నరేందర్‌ ముఖ్యమంత్రిని కలసి విన్నవించారు. ఈ గ్రామాల్లో యాదవులు, కుర్మలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, ప్రభుత్వ పథకంలో వారినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం విలీన గ్రామాల్లోని యాదవులు, కుర్మలను సొసైటీల్లో చేర్పించి, పథకం వర్తింప చేయాలని వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలిని ఆదేశించారు.
 
జూన్‌లో రెసిడెన్షియల్‌ స్కూళ్లు
రాష్ట్రంలో ఎస్టీ బాలికలకు ఏర్పాటు చేసే రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్లు నడపాలని కోరారు. ఈ మేరకు వెంటనే తుది జాబితా రూపొందిం చాలని చందూలాల్‌ను ఆదేశించారు. 
 
గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ
రాష్ట్ర అవతరణ వేడుకలు, పెండింగ్‌ సమస్యలపై చర్చ
గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో అరగంటసేపు చర్చలు జరిపారు. జూన్‌ 2న జరిగే అవతరణ దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లు, రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల తొమ్మిదో షెడ్యూల్‌ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి కేంద్ర హోం శాఖ స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో షెడ్యూల్‌ సంస్థల ఆస్తుల పంపిణీతో పాటు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇటీవల రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలపైనా తెలంగాణ వాదనలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. 
మరిన్ని వార్తలు