-

తప్పు చేసే అధికారం మాకు లేదు..

14 Oct, 2015 19:28 IST|Sakshi
తప్పు చేసే అధికారం మాకు లేదు..

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి, తెలంగాణ మరువలేని మనిషి జేవీ నర్సింగరావు శతజయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగాయి. హోటల్‌ కాకతీయలో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా  తెలంగాణ ముద్దుబిడ్డ పేరిట జేవీ నర్సింగరావుపై రచించిన గ్రంధాన్ని కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ ..రాజకీయనేతగా, విద్యావేత్తగా, న్యాయవాదిగా జేవీ చేసిన సేవలను కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం మంచి,చెడులను భరిస్తూ ముందుకు వెళ్లిన వ్యక్తి అని... ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు. త్వరలో ఆయన విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

'కారణం ఏదైనప్పటికీ ఒంటరిగా ఎన్నికలకు పోయినా ఎందుకో ప్రజలు టీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఏదైనా విషయంలో  అర్థం కాకపోతే అడుగు ముందుకు వేయం. అవసరం అనుకుంటే ఆరు నెలలు ఆగుతాం. అంతేకానీ తెలంగాణ విషయంలో తప్పు మాత్రం చేయం.  తప్పు చేసే అధికారం మాకు లేదు.  దీర్ఘ కాలిక ప్రయోజనాలతో మంచి వేపే అడుగు వేస్తాం. ప్రాణం పోయినా చెడు వైపు అడుగు వేయం. సర్వశక్తులు వినియోగించిన సక్రమ బాటలో తెలంగాణ సాగే విధంగా  కృషి చేస్తాం.' అని కేసీఆర్ అన్నారు. ఈ వేడుకకి టీఆర్ఎస్ నేత కేశవరావు,  కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు