సీఎం కేసీఆర్‌ కూలి పనికి ఏర్పాట్లు

17 Apr, 2017 03:21 IST|Sakshi
సీఎం కేసీఆర్‌ కూలి పనికి ఏర్పాట్లు

అసెంబ్లీ లాబీల్లో తెలిపిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి

సాక్షి, హైదరాబాద్‌: ‘గులాబీ కూలి దినాలు’లో భాగంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను కూలీ చేయడానికి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ 16వ ఆవిర్భావ బహిరంగ సభ కోసం రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త దాకా కూలి పనిచేసి ఖర్చుల సొమ్ములు సంపాదించుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన విషయం విధితమే. దీనిలో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు కూలి పనుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ కూడా కూలి పనిచేయడానికి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరును ఎంచుకున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని, కూలి పనికి కూడా ఏర్పాట్లు చేశామని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది వరికోతల సమయం కావడంతో వరికోసే పనిని చూశామని, అయితే ఈ పనికి రైతుల నుంచి ఏమీ తీసుకోబోమని అన్నారు. తొర్రూరు వ్యాపార వర్గాల నుంచి సీఎం కూలి పనికి డబ్బులు ఇప్పించే ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. కనీసం రూ.20 లక్షల కూలీ సొమ్ము వచ్చేలా చూస్తున్నామన్నారు. కాగా, అదే రోజు సీఎం కేసీఆర్‌ పాలకుర్తి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పాలకుర్తి, బమ్మెర, రాఘవపురం గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు.

>
మరిన్ని వార్తలు