'రూ.వెయ్యికోట్లు ఇచ్చి సహాయం చేయరూ..'

13 Jan, 2016 16:54 IST|Sakshi

హైదరాబాద్‌: రైతుల అవసరాలకోసం అత్యాధునిక గోదాములు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ కు ఆయన లేఖ రాశారు. 2016 వ్యవసాయ సీజన్ పూర్తయ్యే సమయానికి రెండు దశల్లో 17 లక్షల మెట్రిక్ టన్నులను నిల్వచేసే సామర్థ్యం గల గోడౌన్లను నిర్మించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖలో చెప్పారు.

మొత్తం అంచనా వ్యయం రూ.1024 కోట్లు కాగా, నాబార్డు రూ.972.79కోట్ల రుణాన్ని అందిస్తుందని చెప్పారు. అయితే గతంలో వ్యవసాయశాఖ ద్వారా గ్రామీణ భందరాన్ యోజన పథకం కింద ఇలాంటి నిర్మాణాలకు కేంద్రం సబ్సిడీ ఇచ్చేదని, దానిని కేంద్రం తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలిసిందని, అయితే, తాము రైతు సంక్షేమం కోసం ఇప్పటికే ప్రారంభించిన ఈ పని విజయవంతంగా పూర్తయ్యేలా కేంద్రం చూడాలని అన్నారు. రూ. వెయ్యి కోట్లు సహాయం చేసి తాము తలపెట్టిన ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు