సీఎం రమేష్ కార్యాలయం సీజ్

22 Feb, 2014 02:00 IST|Sakshi

 బకాయిలు చెల్లించాక తొలగింపు
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన కార్యాలయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. సామగ్రిని తరలించేందుకు కూడా సిద్ధం కాగా కార్యాలయ సిబ్బంది అప్పటికప్పుడు చెక్కులు అందించడంతో సీజ్‌ను తొలగించారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం బంజారాహిల్స్ రోడ్ నెం. 2 సాగర్ సొసైటీ పక్కన ఉన్న నవోదయ కాలనీలోని ప్లాట్ నం. 37,39లలో కొనసాగుతోంది.
 
 అయితే గత రెండేళ్లుగా ఈ కార్యాలయానికి సంబంధించిన రూ. 10 లక్షల 21 వేల ఆస్తి పన్ను చెల్లించకుండా ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ తప్పించుకుంటున్నారు. బకాయిలు చెల్లించాలని గడిచిన ఏడాది కాలంగా మూడుసార్లు రెడ్ నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో శుక్రవారం జీహెచ్‌ఎంసీ సర్కిల్-10 డిప్యూటీ డీఎంసీ బాబయ్య, వ్యాల్యుయేషన్ అధికారి ముకుందరెడ్డి సహా ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఆస్తిపన్ను జప్తు వాహనంతో వచ్చి కార్యాలయాన్ని సీజ్ చేశారు. సామగ్రిని కూడా తరలించేందుకు యత్నిస్తుండగా కార్యాలయ మేనేజర్ బకాయిపడ్డ డబ్బుకుగాను చెక్కులను అందజేశారు. దీంతో అధికారులు కార్యాలయానికి వేసిన సీజ్‌ను తొలగించారు.

>
మరిన్ని వార్తలు