పంచాయతీల్లోనూ కో–ఆప్షన్‌ సభ్యులు

10 Jan, 2018 02:09 IST|Sakshi

ప్రభుత్వం నామినేట్‌ చేయాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు కూడా కో–ఆప్షన్‌ సభ్యులను నామినేట్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతులు, వివిధ రంగాల్లో నిపుణులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒకరిద్దరిని నామినేట్‌ చేయాలని భావిస్తోంది. ఇక గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకు ఉన్న అన్ని కార్యనిర్వాహక అధికారాలను సర్పంచులకు అప్పగించాలని నిర్ణయించింది.

మొత్తంగా పంచాయతీరాజ్‌ చట్టంలో కీలక మార్పులపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సుదీర్ఘంగా సమావేశమైంది. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, ఈటల, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో పాటు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఒకరిద్దరు కో–ఆప్షన్‌ సభ్యులతో..
మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్తులకు నామినేట్‌ చేస్తున్న తరహాలోనే గ్రామ పంచాయతీలకు కూడా ప్రభుత్వమే కో–ఆప్షన్‌ సభ్యుడిని నామినేట్‌ చేయాలని సమావేశంలో ప్రతిపాదించారు. అదే గ్రామానికి చెందిన విద్యావంతులు, వివిధ రంగాల్లో నిపుణులు, స్వయం సహాయక సంఘం, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఒకరిని లేదా ఇద్దరిని నామినేట్‌ చేసే అంశంపై చర్చించారు.

కో–ఆప్షన్‌ సభ్యుల నియామకంపై సానుకూలత వ్యక్తమైనా.. సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ఎన్నికలో వారికి ఓటు హక్కు ఇవ్వాలా, వద్దా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సర్పంచ్‌ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలా, పరోక్షంగానా అన్నది తేలాక కో–ఆప్షన్‌ సభ్యుల ఓటుహక్కుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఎలాంటి మార్పులు చేయాలన్న అంశాన్ని పరిశీలించే బాధ్యతను అడ్వొకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డికి అప్పగించారు.

జిల్లా స్థాయిలోనే  
జీ ప్లస్‌ టూ ఆపై ఉండే బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు, గ్రామ పంచాయతీల పరిధిలోని లేఔట్లు వంటి వాటికి అనుమతులను కూడా జిల్లా స్థాయిలోనే ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. జిల్లా పంచాయతీ అధికారి అధ్యక్షతన ఈ బాధ్యతను జిల్లా స్థాయి కమిటీకి అప్పగించాలని, నిర్ణీత కాల పరిమితిలోగా దరఖాస్తులను తిరస్కరించడమో, ఆమోదించడమో చేయాలని నిర్దేశించేలా నిబంధనలు రూపొందించాలని నిర్ణయించారు.

రెండు పర్యాయాలు రిజర్వేషన్‌..!
పంచాయతీల్లో రిజర్వేషన్ల రొటేషన్‌పైనా భేటీలో చర్చ జరిగింది. ప్రతిసారి (ఐదేళ్లకోసారి) రిజర్వేషన్‌ రొటేషన్‌ కావడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. అభివృద్ధి చేయాలనుకునేవారికి మరోసారి అవకాశం రావడం లేదని అభిప్రాయం వ్యక్తమైంది. మరోసారి రిజర్వేషన్‌ రాదని, పోటీచేసే అవకాశం కూడా రాదనే ఉద్దేశంతో కొందరు సర్పంచులు బాధ్యతారహితంగా పని చేస్తున్నారనే ప్రస్తావన వచ్చింది. ఈ పరిస్థితిని నివారించడానికి ఏ రిజర్వేషన్‌ అయినా వరుసగా రెండు పర్యాయాలు ఉండాలన్న ప్రతిపాదన వచ్చింది.

తరచూ గ్రామ సభలు
గ్రామాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ఇతర మార్పులు, నిర్ణయాలపై ప్రజలను భాగస్వామ్యం చేయడానికి గ్రామ సభలను ఎక్కువసార్లు నిర్వహించేలా చట్టంలో నిబంధనలు పొందుపరచాలని సబ్‌ కమిటీ భేటీలో నిర్ణయించారు. నెలకోసారి లేదా కనీసం రెండు నెలలకోసారి కచ్చితంగా గ్రామ సభను నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కాగా మంత్రివర్గ ఉప సంఘం బుధ, గురువారాల్లో కూడా సమావేశం కానుంది. అన్ని అంశాలపై లోతుగా చర్చించి, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేలా నివేదికను రూపొందించనుంది.  

‘పంచాయతీ’ ట్రిబ్యునల్‌
ప్రస్తుతం సర్పంచులు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన న్యాయపరమైన (జ్యుడీషియల్‌) అధికారాలు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దగ్గర ఉన్నాయి. దీంతో ఆయా అంశాలకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్న నేపథ్యంలో... న్యాయపరమైన అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా సబ్‌ కమిటీ భేటీలో చర్చించారు. ప్రభుత్వోద్యోగులకు ఉన్నట్టుగానే పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

సర్పంచులకేపూర్తి అధికారాలు
గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటివరకు గ్రామ కార్యదర్శులకు ఉన్న కార్యనిర్వహణాధికారాలను పూర్తిగా సర్పంచులకే అప్పగించాలని సబ్‌ కమిటీ భేటీలో ప్రతిపాదన వచ్చింది. నిధులు, కార్యనిర్వాహక అధికారాలను సర్పంచ్‌కే అప్పగించడంతో పాటు విధులు, బాధ్యతలపైనా ప్రధానంగా చర్చించారు. సర్పంచులు, వార్డు సభ్యులకు పూర్తి అధికారాలను అప్పగించడం ద్వారా జవాబుదారీతనం పెంచవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే సమయంలో నిధుల వినియోగం పారదర్శకంగా ఉండటానికి పలు నియంత్రణలు కూడా విధించాలని నిర్ణయించారు.
 

మరిన్ని వార్తలు