కోడ్ కూసింది

4 Mar, 2014 04:14 IST|Sakshi
కోడ్ కూసింది
  •     అమల్లోకి వచ్చిన నిబంధనావళి
  •      నిలిచిపోనున్న రూ. వందల కోట్ల పనులు
  •      కార్పొరేటర్ల ఆశలు గల్లంతు
  •  సాక్షి, సిటీబ్యూరో : .అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికల ‘కోడ్’ కూసింది... ‘గ్రేటర్’లో వందల కోట్ల పనులకు బ్రేక్ పడనుంది... గడచిన నాలుగేళ్లుగా ‘స్థానిక’ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై శ్రద్ధ చూపని కార్పొరేటర్లు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా ఆవురావురుమని పనుల కోసం పాకులాడారు. పార్టీలకతీతంగా మేయర్, కమిషనర్‌లపై ఒత్తిడి తెచ్చి మరీ వీలైనన్ని నిధులు మంజూరు చేయించుకున్నారు. కానీ ‘అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి..’ అన్న చందాన మున్సిపల్ ఎన్నికల్ కోడ్ ముందుకు దూసుకొచ్చి కార్పొరేటర్ల దూకుడుకు బ్రేక్ వేసింది.  

    దాదాపు నెల రోజులుగా అధికారులపై పట్టుబట్టి.. పంతాలకు పోయి.. ఆందోళనల డ్రామాలు నిర్వహించి.. ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరు చేయించుకున్న గ్రేటర్ కార్పొరేటర్లు... మరో వారం రోజులపాటు వీలైనన్ని శిలాఫలకాలు వేసి, శంకుస్థాపనలు చేద్దామనుకున్నారు. వారు సార్వత్రిక ఎన్నికల కోసం తొందరపడితే అంతకంటే ముందు మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చి టెండర్లు పూర్తికాని వందల రూ.కోట్ల పనులకు అడ్డుకట్ట వేసింది.

    ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో మరో మూడునెలల దాకా కొత్త పనులు చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత కార్పొరేటర్ల ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం ఉండదు. కేవలం మూడు నాలుగు నెలల గడువు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. కేవలం నగర రహదారుల కోసమే రూ. 500 కోట్లకు పైగా నిధులు ఇటీవలే మంజూరయ్యాయి. పాతవి, మరమ్మతులకు సం బంధించినవి, శివార్ల ప్రత్యేక నిధులు తదితరమైనవి వెరసి రోడ్ల కోసం మొత్తం రూ. 735.50 కోట్ల నిధులున్నాయి. వీటిలో వీలైనన్ని పనులకు ఈ  రెండు మూడు రోజుల్లోగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేయాలని భావించిన కార్పొరేటర్ల ఆలోచనలన్నీ తలకిందులయ్యాయి.
     
    వీటికి ఓకే

    సమగ్ర రహదారి అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 285 కోట్లలో రూ. 72.54 కోట్ల పనులకు అధికారులు వర్క్ ఆర్డర్లు జారీ చేశారు. ఆ పనులను ప్రారంభించేందుకు ఆటంకాలుండవు. కాగా శంకుస్థాపనల వంటి లాంఛనాలకు మాత్రం బ్రేక్ పడనుంది. రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినందున స్థానికంగా జరిగే పనుల్లో తమదే ముఖ్య భూమిక అవుతుందనుకున్న కార్పొరేటర్ల ఆశలపై మున్సిపల్ నోటిఫికేషన్ నీళ్లు చల్లింది.
     
    హడావుడి గా శంకుస్థాపనలు

     
    సోమవారం కార్యాలయ వేళలు ప్రారంభమయ్యాక ఏ క్షణాన్నైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిసే జీహెచ్‌ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ రాజకుమార్, కమిషనర్ సోమేష్‌కుమార్.. ఆలోగానే రెండు పనులకు లాంఛనాలు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ‘డ్రైవ్ అండ్ ఓన్ యువర్ వెహికల్’కు, 8.30 గంటలకు ఇందిరాపార్కులో స్విమ్మింగ్‌పూల్ పనులకు శంకుస్థాపన చేశారు.
     

మరిన్ని వార్తలు