ఖాదీ బోర్డులో కోల్డ్ వార్

29 Sep, 2013 03:29 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఖాదీ పరిశ్రమ బోర్డులో కోల్డ్‌వార్ నడుస్తోంది. బోర్డు చైర్మన్‌కు, ఐఏఎస్ అధికారులకు మధ్య వివాదం చెలరేగింది. ఖాదీ బోర్డులో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బోర్డు చైర్మన్ జి. నిరంజన్ ఆరోపించారు. వారి వల్ల తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని, సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కన్పించడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. బోర్డు చైర్మన్ అన్న గౌరవం కూడా తనకు ఇవ్వడం లేదన్నారు. బోర్డు కార్యాలయంలో శనివారం నిరంజన్ మీడియాతో మాట్లాడారు. 1995-96లో ఖాదీ బోర్డుకు సంబంధించిన రూ. 1.30 కోట్లు దుర్వినియోగమైనట్టు ఆడిట్ సంస్థలు పేర్కొన్నాయని, దీనిపై చర్చించాలని కోరినా బోర్డు కార్యనిర్వహణాధికారి కేవీ రమణ పెడచెవిన పెట్టారన్నారు. సమావేశంలో చర్చించాల్సిన అంశాలను సూచించినా.. వేటినీ ఎజెండాలో చేర్చకుండా, అప్పటి రికార్డులన్నీ పాడయిపోయాయని చెప్పడం విస్మయం కల్గిస్తోందన్నారు. తన ఒత్తిడిపై సమావేశం ఏర్పాటు చేసినా.. చర్చ జరగకుండా సీఇవో మధ్యలోనే వెళ్లిపోయారని చెప్పారు. దీనిపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌కు ఫిర్యాదు చేసినా.. ఆయన కూడా సీఈవోను వెనకేసుకొస్తున్నారని చెప్పారు. ఈ ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.
 
 తన ఫిర్యాదుపై సీఎం వివరణ కోరినా ఇద్దరు అధికారులు స్పందించలేదన్నారు. కాగా, నిరంజన్ చేసిన ఆరోపణలను ముఖ్య కార్వనిర్వహణాధికారి రమణ తోసిపుచ్చారు. ఇందులో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. అతి తక్కువ వ్యవధిలోనే 20 అంశాలను ఎజెండాలో చేర్చాలన్న ఆదేశం సాధ్యం కానందునే, తదుపరి సమావేశానికి ఎజెండాను ఖరారు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిని చైర్మన్ ఇప్పటికీ అనుమతించలేదని చెప్పారు. బోర్డులో ఆర్థిక అవకతవకలపై బ్యాంకుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నట్టు వివరించారు.
 

మరిన్ని వార్తలు