నొక్కేస్తే.. పట్టేస్తారు..!

11 Mar, 2017 01:42 IST|Sakshi
నొక్కేస్తే.. పట్టేస్తారు..!

చెకింగ్స్‌పై నజర్‌!
ఈ–చలాన్ల తనిఖీలో సిబ్బంది చేతివాటం
వాహనచోదకుల నుంచి డబ్బు వసూలు
సర్వర్‌తో పీడీఏ మిషన్ల  అనుసంధానం ఇప్పటికే కొందరు
అక్రమార్కుల గుర్తింపు


 సిటీబ్యూరో: ఉల్లంఘనలకు పాల్పడి ఈ–చలాన్లు భారీగా పెండింగ్‌లో ఉన్న వాహనచోదకులపై ట్రాఫిక్‌ విభాగం అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. దీనిని కొందరు సిబ్బంది తమకు అనుకూలంగా మార్చుకుంటూ ‘క్యాష్‌’ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ చెకింగ్స్‌ పైనా కన్నేసి ఉంచుతున్నారు. ఈ నిఘాలో పట్టుబడిన కొందరిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు.

పెరిగిపోతున్న పెండింగ్‌ చలాన్లు...
ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు జరిమానా విధించే విషయంలో ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలోని ట్రాఫిక్‌ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఈ–చలాన్లు పంపిస్తున్నారు. వీటిని ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు ఆర్టీఏ డేటాబేస్‌లో అప్‌డేట్‌ కాలేదు. దీంతో వారికి ఈ–చలాన్లు అందక తమ వాహనంపై చలాన్‌ జారీ అయిందనే విషయం యజమానికి తెలియట్లేదు. మరికొందరు ఉల్లంఘనులకు తమ వాహనంపై చలాన్‌ పెండింగ్‌లో ఉందని తెలిసినా.. ఉద్దేశపూర్వకంగా జరిమానా చెల్లించడంలేదు.

రహదారులపై అడ్డంగా ‘బాదుడు’...
దీంతో ట్రాఫిక్‌ విభాగం అధికారులు పెండింగ్‌ ట్రాఫిక్‌ ఈ–చలాన్ల డేటాబేస్‌ను అధికారుల వద్ద ఉండే పీడీఏ మిషన్లకు అనుసంధానించారు. ఈ మిషన్లతో రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు పెండింగ్‌ ఈ–చలాన్లు ఉన్న వాహనాలను గుర్తిస్తున్నారు. భారీ మొత్తం పెండింగ్‌లో ఉంటే వాహనం స్వాధీనం చేసుకోవడం, బకాయి మొత్తం చెల్లించిన తర్వాతే వదిలిపెట్టడం చేస్తున్నారు. దీంతో ఈ–చలాన్ల వసూలు మాట ఎలా ఉన్నా.. కొందరు సిబ్బంది మాత్రం భారీగా వసూళ్ళకు పాల్పడుతున్నారు. ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనచోదకుల నుంచి డబ్బు తీసుకుని జరిమానా చెల్లించకుండానే వారిని పంపేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో వాహనచోదకుల్ని బెదిరిస్తూ అందినకాడికి తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

సర్వర్‌తో అనుసంధానం...
వీటిని దృష్టిలో ఉంచుకున్న ట్రాఫిక్‌ విభాగం ఉన్నతాధికారులు చెకింగ్స్‌పై సాంకేతిక నిఘా అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు వినియోగించే ప్రతి పీడీఏ మిషన్‌ను సర్వర్‌తో అనుసంధానించడంతో పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. దీంతో ఒక్కో పీడీఏ మిషన్‌ ఆ రోజు ఎన్ని వాహనాల వివరాలు తనిఖీ చేసింది? వాటిలో ఎన్నింటిపై ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి? స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎన్ని? బకాయి తీర్చేలా చర్యలు తీసుకున్నవి ఎన్ని? అనేది ఓ నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందుతోంది. దీని ఆధారంగా ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాలను గుర్తించి, విడిచిపెట్టడానికి కారణాలపై విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ హోంగార్డు చేతివాటం వెలుగులోకి రావడంతో అతడిపై చర్యలకు సిఫార్సు చేశారు. మరికొందరి పాత్ర పైనా అధికారులకు ప్రాథమిక ఆధారాలు అందినట్లు తెలిసింది. వీరిపైనా చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు