నయీమ్ పేరిట వసూళ్లు

9 Oct, 2016 03:38 IST|Sakshi
నయీమ్ పేరిట వసూళ్లు

సాక్షి, హైదరాబాద్: వ్యాపారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్లు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నకిలీ మావోయిస్టు గ్యాంగ్‌ను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో నల్లగొండ జిల్లా గంచమల్ల గ్రామానికి చెందిన బొల్ల నర్సింహులు అలియాస్ నర్సింహ అలియాస్ సలీమ్ అలియాస్ శీనన్న, పల్లెల సురేందర్, అక్కారం కృష్ణ, రాచకొండ శ్రీరాము లు ఉన్నారు. సమ్మయ్య అనే వ్యక్తి పరారీలో ఉ న్నాడు. నిందితుల నుంచి మూడు లక్షల 90 వేల నగదు, బొమ్మ పిస్తోలును స్వాధీనం చేసుకున్నా రు. వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ శనివారం ఇక్కడ వెల్లడించారు.

బొల్ల నర్సింహులు ఆరో తరగతి వరకు చదువుకున్నాడు. మేస్త్రీ పనిచేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు సమ్మయ్యతో కలసి మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరుతో డబ్బులు వసూలు చేసేవాడు. వీరు మొదట జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడ వ్యాపారి ఆర్.బాలమల్లేష్‌ను బెదిరించి లక్షల్లో నగదును వసూలు చేశారు. 60 గజాల నోటరీ ప్లాట్‌ను తమ పేరిట రాయించుకున్నారు. అనంతరం పల్లెల సురేందర్, అక్కారం కృష్ణ, రాచకొండ శ్రీరాములుతో కలసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు. తాజాగా రూ.50 లక్షలు ఇవ్వాలని జవహర్‌నగర్‌లోని ఆదిత్య ఆస్పత్రి యజమానిని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగడంతో ముఠా గుట్టు రట్టయ్యింది.

 వీరి స్టైలే వేరు..
 వ్యాపారులను బెదిరించడం కోసం ఈ గ్యాంగ్ రెండు సెల్‌ఫోన్ నంబర్లు తీసుకుంది. వీటిని కేవలం ఔట్‌గోయింగ్ కోసం ఉపయోగిస్తూ వ్యాపారులను బెదిరించేది. ఈ ముఠాసభ్యులు టార్గెట్ చేసిన వ్యాపారితోపాటు ఆ కుటుంబాన్ని రెక్కీ చేసి వివరాలను ఆరా తీసేవారు. ఆ తర్వాత ఫోన్‌లో బెదిరించేవారు. వినకపోతే కుటుంబసభ్యుల వివరాలను చెబుతూ పిల్లలు ఏ స్కూల్, కాలేజ్, ట్యూషన్ చదువుతున్నారో, ఏ సమయాల్లో బయటకి వెళుతుంటారో, తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తుంటారో చెబుతూ బెదిరించేవారు. దీంతో బాధితులు భయపడి వారు అడిగిన సొమ్మును ఇచ్చేవారు.

మరిన్ని వార్తలు