రండి..శుభాకాంక్షలు చెప్పండి..!

2 Jan, 2016 01:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  ‘హైదరాబాద్‌లోని ఐఏఎస్‌లు అందరూ విజయవాడ వచ్చి ముఖ్యమంత్రిని అభినందించాలి. ఇందుకు తగిన రవాణా ఏర్పాట్లు జరిగాయి. సచివాలయం నుంచి ఒంటిగంటకు వోల్వో బస్సు విజయవాడకు బయలుదేరుతుంది’... ఇదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సీఎంవో ఆఫీసు నుంచి ఐఏఎస్‌లందరికీ వచ్చిన ఎస్‌ఎంఎస్. శనివారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమికి సమాయత్తమవుతున్న ఐఏఎస్ లు ఈ ఎస్‌ఎంఎస్‌లతో విస్తుపోయారు. బహిరంగ సభలకు జనాన్ని వాహనాల్లో తరలించడం చూశాం గాని ముఖ్యమంత్రిని అభినందించేందుకు వోల్వో బస్సులు పెట్టి ఐఏఎస్‌లను తీసుకువెళ్లడం ఏమిటంటూ రుసరుసలాడారు.

అయినా పిలిపించుకుని మరీ అభినందనలు చెప్పించుకోవాల్సిన అగత్యం ముఖ్యమంత్రికి వస్తే ఎలా? అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా నయం, బహిరంగ సభలకు తోలే జనానికి ఇచ్చినట్టు ఓ బిర్యానీ ప్యాకెట్టు, క్వార్టర్ మందు ఇస్తామన్నారు కాదంటూ ఓ ఐఏఎస్ జోక్ పేల్చారు. విజయవాడ పోయి వచ్చేందుకు కనీసం 10 గంటలు పడుతుందని, మళ్లీ తెల్లవారుతూనే జన్మభూమి విధులకు హాజరు కావాల్సి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నమ్మినబంట్లు ఎవరో తమ పలుకుబడిని చూపించుకునేందుకు ఈ పని చేశారంటూ వాపోయారు. ఇంత హడావుడి చేసినా... ఐఏఎస్ అధికారులు లింగరాజు పాణిగ్రాహి, సిసోడియా, జేసీ శర్మ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముద్దాడ రవిచంద్ర, అశోక్‌లు మాత్రమే బస్సులో వెళ్లగా... మిగతావారు విమానాల్లోనే వెళ్లడం గమనార్హం.

 సీఎం ఒక్కరు వస్తే...
 ముఖ్యమంత్రి ఒక్కరు హైదరాబాద్‌కు వస్తే ఇంతమంది అధికారులు విమానాల్లో, కార్లలో, గరుడ బస్సులో విజయవాడకు  వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని, దీనివల్ల సర్కారు ఖజానాపై భారం తగ్గేదని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానించాయి. సీఎం ఒక్కరు హైదరాబాద్ వచ్చి ఉంటే ఈ వృథా వ్యయం తప్పేదని చర్చించుకున్నారు. కేవలం ఆరుగురికోసం 48 సీట్లున్న గరుడ బస్సులు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తపరిచారు.

మరిన్ని వార్తలు