కమెడియన్ ఆలీ.. ఖైదీల 'శ్రీమంతుడు'

3 Oct, 2015 05:05 IST|Sakshi
గాంధీ జయంతి సందర్భంగా చంచల్ గూడ జైలులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు ఆలీ

హైదరాబాద్: 'శ్రీమంతుడు' సినిమా స్ఫూర్తితో సినీ నటులు, రాజకీయ నాయకులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. కాగా, అందరికంటే భిన్నంగా.. దత్తత విషయంలో మరో ముందడుగు వేశారు కమెడియన్ ఆలీ. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం చంచల్ గూడా జైలులో సందడిచేసిన ఆలీ.. నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ప్రతి ఏటా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా సెలబ్రీటీలను తీసుకొచ్చి ఖైదీలతో మాట్లాడించే అధికారులు ఈ సారి ఆలీని ఆహ్వానించారు. జైలు ప్రాంగణంలో ఆడా, మగ ఖైదీలు, అధికారులు పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్న ఆలీ.. హాస్యోక్తులతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీఐజీ నర్సింహ మాట్లాడుతూ.. ఓ ఖైదీని దత్తత తీసుకోవాలని అలీకి సూచించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆలీ.. నలుగురు మహిళా ఖైదీలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కలెక్టర్ బొజ్జ రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు