విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గించేందుకు కమిటీ

21 Mar, 2016 22:56 IST|Sakshi
విద్యార్థుల పుస్తకాల బరువు తగ్గించేందుకు కమిటీ

సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు మోస్తున్న పుస్తకాల బరువు 10 నుంచి 12 కిలోలు. అదే హైస్కూల్ విద్యార్థులైతే 15 నుంచి 18 కేజీల బరువైన పుస్తకాలను మోస్తున్నారు. వాస్తవానికి స్కూల్ బ్యాగుల బరువు 4 నుంచి 6 కిలోల మధ్యే ఉండాలన్నది నిపుణుల అభిప్రాయం. దీంతో విద్యార్థులు అదనంగా మోస్తున్న ఆ 10 కేజీల బరువును తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యార్ధులకు అతి భారంగా మారిన పుస్తకాల బరువును తగ్గించేలా అవసరమైన చర్యలకోసం సిఫార్సులు చేసేందుకు సలహా కమిటీని నియమించినట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కమిటీలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎం.వి.వి.ఎస్.మూర్తి, రాము సూర్యారావుతో పాటు డాక్టర్ ఎస్.ఆర్.పరిమి (వికాస విద్యావనం, విజయవాడ), శ్రీరామ పద్మనాభం (రిషి వ్యాలీ, మదనపల్లె), డాక్టర్ ఎన్.మంగాదేవి (శ్రీవెంకటేశ్వర బాలకుటీర్, గుంటూరు), డాక్టర్ డి.సరస్వతి (లెబన్ స్కెల్ఫ్, విశాఖపట్నం), డాక్టర్ పి.డి.కామేశ్వరరావు (శోధన, చీపురుపల్లి), సి.వి.కృష్ణయ్య (జనవిఙానవేదిక), డాక్టర్ యూ.సుబ్బరాజు (టింబక్తు), టీవీఎస్ రమేష్ (ఎస్‌సీఈఆర్టీ) తదితరులు సభ్యులుగా ఉంటారని వివరించారు. సోమవారం తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కమిటీ చేసే సూచనలను కూలంకషంగా పరిశీలించాక విద్యార్ధులపై పుస్తకాల బరువు తగ్గేలా చర్యలు చేపడతామన్నారు.

టెన్త్ పరీక్షల్లో పేపర్‌లీక్ అవాస్తవం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకైనట్లు వచ్చిన వార్తల్ల వాస్తవం లేదని మంత్రి గంటా వివరించారు. పేపర్‌లీక్ ఎక్కడా కాలేదని, ఈమేరకు అన్ని జిల్లాలనుంచి తమకు నివేదికలు అందాయని చెప్పారు. మీడియా ఇలాంటి విషయాల్లో నిజనిర్ధారణ చేసుకొని ప్రసారాలు చేస్తే మంచిదని లేనిపక్షంలో వదంతులు వ్యాపించి విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలో పడతారని పేర్కొన్నారు. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చొని పరీక్షలు రాసే పరిస్థితి లేకుండా అన్ని చోట్లా సరిపడా ఫర్నీచర్‌ను సమకూర్చామని మంత్రి చెప్పారు.

ఇద్దరు హెడ్మాస్టర్ల సస్పెన్షన్
పరీక్షలకు ఒకరోజు ముందు స్కూల్‌ను ఓ ఫంక్షన్‌కు ఇచ్చిన నెల్లూరులోని పొదలకూరు రోడ్డులోని జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్‌ను, అదే రోడ్డులోని బాలికల హైస్కూల్ హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి గంటా ప్రకటించారు. అధికారులు, టీచర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మంగళవారం అన్ని యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు