భూ కేటాయింపునకు మంత్రుల కమిటీ

29 May, 2016 01:43 IST|Sakshi
భూ కేటాయింపునకు మంత్రుల కమిటీ

ఉప ముఖ్యమంత్రి కేఈకి చోటు కరువు

 సాక్షి, హైదరాబాద్:  కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (సీఆర్‌డీఏ) పరిధిలో పలు సంస్థలకు భూముల కేటాయింపునకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తికి ఈ కమిటీలో స్థానం కల్పించక పోవడం గమనార్హం.

తొలి నుంచి కూడా రాజధాని భూముల విషయంలో ఉప ముఖ్యమంత్రిని సీఎం దూరంగా ఉంచుతున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావులకు స్థానం కల్పించారు. ఈ కమిటీకి సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక, వైద్య.. ఆరోగ్య, ఉన్నత విద్య శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ కమిటీకి సహాయ సహకారాలు అందిస్తారు.

మరిన్ని వార్తలు