ఇసుక మాఫియా ఆగడాలపై కమిటీ

11 Dec, 2015 03:41 IST|Sakshi
ఇసుక మాఫియా ఆగడాలపై కమిటీ

సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఉమ్మడి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మాఫియా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రతిరోజూ తమ ముందు దాఖలవుతున్న వ్యాజ్యాలే ఇసుక మాఫియా ఆగడాలకు ఉదాహరణలని పేర్కొంది. ఈ వ్యాజ్యాల విచారణకే తాము అధిక సమయం వెచ్చించాల్సి వస్తోందని, దీని ప్రభావం ఇతర కేసులపై పడుతోందని తెలిపింది. ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని తాము ఇలా పర్యవేక్షణ చేయలేమని స్పష్టం చేసింది. ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో పర్యావరణ, గనులశాఖల ముఖ్య కార్యదర్శులు, ఓ స్వచ్ఛంద సంస్థకు స్థానం కల్పిస్తామని తెలిపింది.

ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, వాటిపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవడంతోపాటు లీజు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. సదరు లీజును రద్దు చేసే అధికారాన్ని కూడా ఈ కమిటీకి కట్టబెట్టాలన్నదే తమ అభిప్రాయమని పేర్కొంది. శాశ్వత ప్రాతిపదికన ఈ కమిటీ ఉండాలన్నదే తమ ఆలోచనగా వివరించింది. తమ ఈ ప్రతిపాదనలపై అభిప్రాయం చెప్పాలని ఉభయ రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను పదిరోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 నివేదిక సంగతేంటి?

 పశ్చిమగోదావరి జిల్లా ప్రక్కిలంక గ్రామ పరిధిలో ‘ప్రక్కిలంక శాండ్ మైనింగ్ కోఆపరేటివ్ సొసైటీ’ అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతోందంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. దీన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం... ఇసుక మాఫియా ఆగడాల అడ్డుకట్టకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు ప్రతిపాదనను తీసుకొచ్చి పలు వ్యాఖ్యలు చేసింది. తర్వాత గత విచారణ సమయంలో తామిచ్చిన ఆదేశాల గురించి ప్రస్తావించింది.

‘ప్రక్కిలంక శాండ్ మైనింగ్ కోఆపరేటివ్ సొసైటీ’ ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతోందంటూ పిటిషనర్ తమ ముందుం చిన ఫొటోల వాస్తవికతను తేల్చి, అందుకు సంబంధించి ఓ నివేదికను తమ ముందుం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ను ఆదేశించామని, దాని సంగతేమిటని ప్రశ్నించింది. జాయింట్ కలెక్టర్ తరఫున ఏజీ పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టులో దాఖలు చేసిన ఫోటోలతో సరి పోల్చేందుకు తాజాగా ఫోటోలు తీసి సిద్ధం చేశామని ఆయన తెలిపారు. మరి నివేదిక సంగతేమిటని ధర్మాసనం ప్రశ్నించగా.. తయారు చేయలేదని ఏజీ చెప్పారు. దీంతో తాము నవంబర్ 19న ఆదేశించిన విధంగా నివేదికను తయారుచేసి త మ ముందుంచాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు