రాష్ట్ర ఏర్పాటు తేదీ నుంచి పరిహారమిస్తాం

30 Sep, 2015 04:14 IST|Sakshi
రాష్ట్ర ఏర్పాటు తేదీ నుంచి పరిహారమిస్తాం

- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వర్తింపచేస్తామని ప్రభుత్వం ప్రకటన
- రుణమాఫీలో మిగిలిన 50 శాతం ఒకేసారి చెల్లిస్తాం: పోచారం
- రెండేళ్ల అనావృష్టి కారణంగానే రైతుల్లో నిస్సహాయత
- రాష్ట్రంలో సగానికిపైగా పంటలు దెబ్బతిన్నాయి
- భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి
- అస్తవ్యస్త విద్యుత్ సరఫరా, సాగునీటిపై నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి
- రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన గతేడాది జూన్ రెండో తేదీ నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలన్నింటికీ పెంచిన పరిహారాన్ని వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక రైతుల రుణమాఫీలో మిగిలిన యాభై శాతం సొమ్మును ఒకేసారి విడుదల చేస్తామని తెలిపింది. వర్షాభావం, రైతుల సంక్షేమం, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ ప్రకటన చేశారు.

రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం సాధ్యమైనన్ని చర్యలు చేపడుతున్నందున  ఆత్మహత్యలనే విపరీత చర్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రూ.8,336 కోట్ల రుణమాఫీ నిధులను విడుదల చేయడంతో పాటు విత్తనాలు, ఎరువుల బఫర్ నిల్వలను అందుబాటులో ఉంచడం, అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నా... రెండేళ్లుగా నెలకొన్న అనావృష్టి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు నిస్సహాయతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడం, భూగర్భ జలాలు అసాధారణంగా తగ్గిపోవడం, ఎక్కువ సంఖ్యలో బోరు బావులు వేయడం, చిన్నతరహా సాగునీటి వనరులు, చెరువుల అభివృద్ధిని దశాబ్దాలుగా పట్టించుకోకపోవడం, గతంలో అస్తవ్యస్త విద్యుత్ సరఫరా రైతుల నిస్సహాయతకు కారణమన్నారు. ‘‘ఖరీఫ్‌లో సాధారణ రుతుపవనాల ఆగమనం జూన్ 13 నుంచి ఆరంభమైంది. దాంతో అన్ని జిల్లాల్లో వర్షాధార పంటలు వేశారు. కానీ తొలకరి అనంతరం 25 రోజులు వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. 66 శాతం లోటుతో ఎర్రరేగడి భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. తిరిగి ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాలు కురవడంతో లోటు 14శాతానికి తగ్గింది. 35.13 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణం 41.43 లక్షల హెక్టార్లతో పోలిస్తే ఇది 85 శాతం. నాట్లు వేసిన మొత్తం విస్తీర్ణంలో 26.03 లక్షల హెక్టార్లు వర్షాధారం కింద, 9.1 లక్షల హెక్టార్లు సాగునీటి వనరుల కింద ఉన్నాయి..’’ అని మంత్రి వివరించారు.

ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ రెవెన్యూ డివిజన్ మినహా వరంగల్ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదుకాగా... కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో అనావృష్టితో 50 శాతం మేరకు పంటలు ప్రభావితమయ్యాయని చెప్పారు. నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని చాలా మండలాల్లో వ ర్షపాతం లోటుతో 75 శాతం మేరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. నల్లరేగడి భూముల్లో వేసిన పంటలు మాత్రమే నిలదొక్కుకున్నాయని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షపాతం అత్యల్పంగా ఉండటంతో నూటికి నూరు శాతం పంట నష్టం వాటిల్లిందన్నారు.

>
మరిన్ని వార్తలు