రోగుల సేవలో తరించే... నర్సింగ్

1 Jul, 2014 23:44 IST|Sakshi
రోగుల సేవలో తరించే... నర్సింగ్

అప్‌కమింగ్ కెరీర్
 
ఆత్మసంతృప్తితోపాటు అధిక వేతనాన్ని ఇచ్చే పవిత్రమైన వృత్తి.. నర్సింగ్. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగిని పగలు రాత్రి కనిపెట్టుకొని ఉండి, సొంత మనిషిలా సేవలు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిస్తే కలిగే ఆనందం వెలకట్టలేనిది. నర్సింగ్ కోర్సులను అభ్యసిస్తే దేశ విదేశాల్లో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతుండడం నేటి యువతను ఆకర్షిస్తోంది. అందుకే ఈ కెరీర్‌లో అడుగుపెట్టే వారి సంఖ్య పెరుగుతోంది.  

కోర్సు చేస్తే కొలువు ఖాయం

భారత్‌లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో ప్రతి 150 మందికి ఒక నర్సు అందుబాటులో ఉండగా మనదేశంలో 2250 మందికి ఒకరు మాత్రమే ఉండడం గమనార్హం. వృత్తిలో అనుభవం కలిగిన నర్సులకు అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మనదేశంలో చాలామంది విద్యార్థులు నర్సింగ్ కోర్సులు పూర్తిచేసిన వెంటనే విమానం ఎక్కేస్తున్నారు. నర్సు అంటే సాధారణంగా మహిళలే గుర్తుకొస్తారు. కానీ, ఇటీవల యువకులు సైతం ఇందులోకి అడుగుపెడుతున్నారు. పురుషుల వార్డులు, ఓటీ, ఓపీడీ, ఆర్థోపెడిక్ కేర్, క్యాజువాల్టీ, ఎమర్జెన్సీ వార్డుల్లో పురుష నర్సుల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.  

⇒  విధులేంటి?

నర్సుల ప్రధాన విధి రోగులను కనిపెట్టుకొని ఉండడం. అవసరమైన సేవలు అందించడం. వైద్యులు సిఫార్సు చేసిన మందులు, టీకాలను వేళకు ఇవ్వడం. రోగుల్లో వస్తున్న మానసిక, శారీరక మార్పులను పసిగట్టి డాక్టర్లకు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఔషధాలకు, చికిత్సలకు రోగుల స్పందిస్తున్న తీరును పరిశీలించాలి. తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రంగంలో సవాళ్లు కూడా ఉంటాయి. పగలు, రాత్రి పనిచేయాల్సి ఉంటుంది. నర్సింగ్ కోర్సు చేసిన వారికి వెంటనే ఉద్యోగావకాశాలు  లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో.. హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, రెడ్ క్రాస్ సొసైటీ, నర్సింగ్ కౌన్సిళ్లు వంటి వాటిలో ఉద్యోగాలు ఉంటాయి. ఆసక్తి ఉంటే నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు.   

విదేశాల్లో అవకాశాలు అపారం

 ‘‘సానుకూల దృక్పథం, సేవ చేయాలనే ఆలోచన ఉన్నవారికి అనువైన కెరీర్.. నర్సింగ్. ఈ వృత్తి స్టడీ, వర్కింగ్ స్టయిల్ మిగిలిన వాటితో పోల్చితే పూర్తి విభిన్నం. దీంతో దీన్ని కెరీర్‌గా ఎంచుకునేందుకు గతంలో ఎక్కువమంది ఆసక్తి చూపలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. నర్సింగ్ పూర్తిచేసిన వారికి విదేశాల్లో భారీ వేతనాలు అందుతున్నాయి.  రాబోయే రోజుల్లో ఇక్కడా బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయి. ప్రారంభంలో తక్కువ జీతం అందినా.. మున్ముందు పదోన్నతులు, వేతనాలు పెరిగేందుకు స్కోప్ ఉన్న కెరీర్ నర్సింగ్. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది’’
 
 - ఒనిలాసాలిన్స్, ప్రిన్సిపల్, అపోలో నర్సింగ్ కళాశాల, హైదరాబాద్
 
 

మరిన్ని వార్తలు