2018 ఆగస్టుకి మెట్రో పూర్తి చేయండి

12 Dec, 2016 15:14 IST|Sakshi
2018 ఆగస్టుకి మెట్రో పూర్తి చేయండి

- ఎల్‌అండ్‌టీ మెట్రో, హెచ్‌ఎంఆర్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
- మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును 2018 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎల్‌అండ్‌టీ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్‌ఎంఆర్) అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్-మియాపూర్(29 కి.మీ) మార్గంతోపాటు నాగోల్-శిల్పారామం(28 కి.మీ)మార్గాన్ని 2017 నవంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌ను మా, నాగోల్-రాయదుర్గం మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో జరుగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఎల్‌అండ్‌టీ మెట్రో చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్, ఎండీ శివానంద్, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగోల్-బేగంపేట్, మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్ రూట్లను 2017 మార్చి 28(ఉగాది) రోజు న ప్రారంభించే అంశంపైనా చర్చించినట్టు తెలిసింది.

 శిల్పారామం వరకే మెట్రో..?
 నాగోల్-రాయదుర్గం(కారిడార్-3) మార్గాన్ని శిల్పారామం వరకే పరిమితం చేయనున్నట్లు ఎల్‌అండ్‌టీ మెట్రో అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. తొలుత(2012లో) శిల్పారామం వరకే మెట్రో మార్గం ప్రతిపాదించినప్పటికీ పార్కింగ్, ప్రయాణీకుల వసతి సముదాయాల ఏర్పాటు కోసం శిల్పారామం నుంచి రహేజా ఐటీపార్క్ వరకు ఈ మార్గాన్ని 1.3 కి.మీ. మేర పొడిగించారు. తాజాగా ఈ ప్రాంతంలో ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా బహుళ వరుసల రహదారులు నిర్మించాలని సర్కారు సంకల్పించిన నేపథ్యంలో శిల్పారా మం వరకే మెట్రోను తొలుత పరిమితం చేస్తామని, ఎస్‌ఆర్‌డీపీ పనుల అనంతరం దీనిని పొడిగిస్తామని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది.

 పాతనగరానికి మెట్రో వెళ్లేనా..?
 జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్-2) మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.3 కి.మీ. మెట్రో మార్గం ఖరారుపై స్పష్టత లేకపోవడంతో పాతనగరానికి మెట్రో మార్గం వెళుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పాత అలైన్‌మెంట్ ప్రకారం ఇప్పుడు పనులు చేపట్టినా అది పూర్తయ్యేందుకు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. కాగా, మెట్రో ప్రాజెక్టు గడువు 2017 జూన్ నుంచి 2018 ఆగస్టుకు పెరగడం, ఆస్తుల సేకరణ ప్రక్రియ ఆలస్యం కావడంతో నిర్మాణ సంస్థపై రూ.3 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందించాలని ఎల్‌అండ్‌టీ మెట్రో వర్గాలు ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం.
 
 ప్రభుత్వం సహకరిస్తోంది
 మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరిస్తోందని ఎల్‌అండ్‌టీ మెట్రో చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దశల్లో మెట్రో మార్గాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. మొత్తం 72 కి.మీ. మార్గానికిగానూ ఇప్పటివరకు 61.20 కి.మీ. మార్గంలో పునాదులు సిద్ధం చేశామని, 58.10 కి.మీ. మార్గంలో పిల్లర్ల ఏర్పాటు పూర్తరుు్యందన్నారు. ప్రస్తుతానికి 36.25 కి.మీ. మార్గంలో మెట్రో పట్టాలు పరుచుకున్నాయన్నారు. మొత్తం 65 స్టేషన్లకుగానూ 17 స్టేషన్లు పూర్తిగా సిద్ధమయ్యాయని, మరో 30 స్టేషన్లు తుది దశకు చేరు కున్నాయన్నారు.

>
మరిన్ని వార్తలు