‘చెత్త’ గోడుకు ‘గోడ’ విరుగుడు

28 Jan, 2018 03:08 IST|Sakshi

 రైల్వే శాఖ ‘కాంక్రీట్‌’ఐడియా

ట్రాక్‌కు ఇరువైపులా నిర్మాణం

జనావాసాలు దగ్గరగా ఉన్న చోట..  

స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ :  జనావాసాలకు చేరువగా ఉండే రైలు పట్టాలు చెత్తాచెదారంతో నిండి ఉండటం కనిపిస్తూనే ఉంటుంది. ట్రాక్‌కు చేరువగా ఉండే వారు ఇళ్లల్లోని చెత్తను పట్టాలపై వేస్తుండటంతో పెద్దమొత్తంలో చెత్త పోగై పట్టాలు అసహ్యంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ అంటూ పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నా.. పట్టాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి.

ఈ సమస్యకు చెక్‌ పెట్టాలనుకున్న రైల్వే బోర్డు.. ‘గోడ’పరిష్కారాన్ని కనుగొంది. జనావాసాలు ఉన్న చోట పట్టాలకు రెండువైపులా కాంక్రీట్‌ గోడలు నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే జోనల్‌ రైల్వే అధికారుల సూచనలు బోర్డు స్వీకరించగా.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులూ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.  

అడ్డుగోడలే పరిష్కారమని..
చాలా చోట్ల పట్టాలను ఆనుకుని పేదలు తాత్కాలిక ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల మురికివాడలున్నాయి. సాధారణ కాలనీల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నా.. మురికివాడలపై అంతగా దృష్టి లేదు. దీంతో ఇళ్లల్లోని చెత్తను రైల్వే పట్టాల వెంట స్థానికులు డంప్‌ చేస్తున్నారు. వీటిల్లోని ప్లాస్టిక్‌ సంచులు గాలికి కొట్టుకొచ్చి రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తున్నాయని సిబ్బంది ఫిర్యాదు చేస్తున్నారు.

ఆ సమస్య కన్నా కూడా రైల్వే స్థలాలు అత్యంత అసహ్యంగా కనిపిస్తుండటమే పెద్ద సమస్యగా మారింది. స్థానికుల్లో అవగాహన కోసం గతంలో అనేక సార్లు రైల్వే శాఖ యత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో అడ్డుగోడలు నిర్మించడమే సమస్యకు పరిష్కారంగా నిర్ణయించారు.  

తొలుత ఇనుప మెష్‌లు..
తొలుత ఇనుప మెష్‌లు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దాన్ని చోరీ చేసే అవకాశాలుండటంతో విరమించుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో కాంక్రీట్‌ గోడ నిర్మించాలనుకుంటున్నారు. కానీ.. అవసరమైన నిధులు విడుదల చేయక ఎన్నో రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్న తరుణంలో గోడ కోసం భారీగా వ్యయం ఏంటని విమర్శలొస్తున్నాయి.

అయితే స్వచ్ఛభారత్‌కు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తున్నందున గోడ నిర్మాణానికే రైల్వే శాఖ మొగ్గు చూపుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ‘ట్రాక్‌ పొడవునా గోడ ఉండదు. ఇళ్లు చేరువగా ఉన్న చోటే నిర్మిస్తారు. ఇది భారీ వ్యయం కాకపోవచ్చు’అని ఓ రైల్వే అధికారి అన్నారు.


నిర్మించినా సాధ్యమా?..
గోడ నిర్మించినా సమస్య పరిష్కారమవుతుందన్న భరోసా లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కవర్లలో చెత్త మూటగట్టి గోడపై నుంచి ట్రాక్‌ వైపు గిరాటేసే అవకాశం ఉందని వాదన. అయితే గోడ ఎత్తుగా ఉండనున్నందున అన్ని చోట్లా చెత్త కవర్లు ఎత్తేసే అవకాశం ఉండదని, సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ పరిధిలోని ‘ది రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌ఓ)’గోడ నిర్మాణ నమూనాలూ సిద్ధం చేసిందని, దీనికి రైల్వే బోర్డు పచ్చజెండా ఊపిందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు