సెంటర్‌ ఫర్‌ ‘గుడ్డి’ గవర్నెన్స్‌

19 Aug, 2017 00:38 IST|Sakshi
సెంటర్‌ ఫర్‌ ‘గుడ్డి’ గవర్నెన్స్‌
- డిగ్రీ మూడో దశ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో గందరగోళం
మారిపోయిన 3 వేల మంది సీట్లు.. 92 మంది సీట్ల గల్లంతు
సీజీజీ తప్పిదంతో విద్యార్థుల్లో ఆందోళన
 
సాక్షి, హైదరాబాద్‌: సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) అధికారుల తప్పిదం వేల మంది డిగ్రీ విద్యార్థులకు శాపంగా మారింది. డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల సీట్‌ మ్యాట్రిక్స్‌ సరిగ్గా చేయలేకపోవడంతో సీట్ల కేటాయింపులో గందరగోళం ఏర్పడింది. మెరిట్‌ ఉన్న విద్యార్థులకు సాధారణ కాలేజీల్లో, మెరిట్‌ లేని విద్యార్థులకు టాప్‌ కాలేజీల్లో సీట్లు లభించాయి. వెంటనే ఆ తప్పిదాన్ని సీజీజీ గుర్తించినా ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకుపోలేదు. ఈ విషయాన్ని విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు తెలియజేయలేదు. మరోవైపు అనేక మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందారు.

ఇవన్నీ పూర్తయ్యే సమయంలో గురువారం చావు కబురు చల్లగా చెప్పింది. ‘మీకు సీటు ఆ కాలేజీలో కాదు.. మరో కాలేజీలో కేటాయించాం... అందులో చేరండి..’అంటూ సమాచారం పంపడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ఇలా దాదాపు 2,900 మంది విద్యార్థులు సీట్లు మారిపోయాయని, 92 మంది విద్యార్థులు సీట్లు కోల్పోయారని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ, వారి సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం వందల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
 
17న మళ్లీ సీట్ల కేటాయింపు
డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భాగంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కమిటీ ఆధ్వర్యంలో జూన్, జూలై నెలల్లో ఒకటి, రెండో దశల కౌన్సెలింగ్‌ను సీజీజీ నిర్వహించింది. ఇందులో దాదాపు 2 లక్షల మందికి సీట్లను కేటాయించగా, 1.51 లక్షల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. ఇక మూడో దశ కౌన్సెలింగ్‌ను గత నెల 21వ తేదీ నుంచి నిర్వహించింది. గత నెల 31వ తేదీ వరకు 78 వేల మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 4వ తేదీన సీట్లను కేటాయించాల్సి ఉండగా ప్రాసెస్‌ పూర్తి కాలేదని 9వ తేదీకి వాయిదా వేసింది. 9వ తేదీ రాత్రి 72 వేల మంది విద్యార్థులకు సీట్లను కేటాయించింది.

ఆ కేటాయింపులకు చేసిన సీట్‌ మ్యాట్రిక్స్‌లో తప్పులు దొర్లినట్లు ఈ నెల 11న గుర్తించింది. కొన్ని ఉర్దూ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరగకపోవడంతో ఆ అంశంపై దృష్టి సారించగా ఈ విషయం బయటపడింది. దీంతో ఈ నెల 17న తాజాగా మళ్లీ సీట్లను కేటాయించింది. దీంతో దాదాపు 2,900 మంది సీట్లు మారిపోయాయి. 92 మంది సీట్లు గల్లంతయ్యాయి. సీట్లు మారాయని, తాజాగా సీటు వచ్చిన కాలేజీలో చేరండని మెసేజ్‌లు రావడంతో విద్యార్థులు ఆందోళనలో పడ్డారు.

అప్పటికే అనేక మంది కాలేజీల్లో చేరిపోయారు. ఇప్పుడేం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు సొంతంగా ప్రవేశాలు చేసుకునే 28 కాలేజీల్లోనూ సీజీజీ సీట్లను కేటాయించింది. తీరా విద్యార్థులు అక్కడికి వెళితే వారిని చేర్చుకోవడం లేదు. ఒకటీ రెండురోజుల్లో కమిటీ సమావేశం నిర్వహించి విద్యార్థులెవరికీ అన్యాయం జరక్కుండా తగిన నిర్ణయం తీసుకుంటామని మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు