కాంగ్రెస్-టీడీపీ చెట్టాపట్టాల్!

26 Dec, 2015 16:39 IST|Sakshi
కాంగ్రెస్-టీడీపీ చెట్టాపట్టాల్!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేయి - సైకిల్ జోడీ
 
హైదరాబాద్‌
సుదీర్ఘకాలంగా రాజకీయ శత్రువులుగా కొనసాగిన కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యాయి. స్థానిక సంస్థల కోటాలో ఆదివారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని ఒప్పందాలు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరుగుతున్న రెండు సీట్ల కోసం మొదటి, రెండో ప్రాధాన్యతా ఓట్లను పరస్పరం వేసుకోవాలన్న అంగీకారానికి వచ్చాయి.
 
ఈ జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్ ఇద్దరు అభ్యర్థులను నిలపగా, కాంగ్రెస్, టీడీపీ ఒక్కో అభ్యర్థిని మాత్రమే పోటీ పెట్టాయి. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి ఈ రెండు పార్టీలు పరస్పర అవగాహనకు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతుదారులంతా ఆ పార్టీ అభ్యర్థికి తొలి ప్రాధాన్యతా ఓట్లు వేస్తారు. రెండో ప్రాధాన్యతా ఓట్లను టీడీపీకి వేస్తారు. అలాగే టీడీపీ ఓటర్లంతా తొలి ప్రాధాన్యతా ఓట్లను టీడీపీ అభ్యర్థికి, రెండో ప్రాధాన్యతా ఓట్లను కాంగ్రెస్‌కు వేసేలా రెండు పార్టీలు ఒప్పందానికి వచ్చాయి. మహబూబ్‌నగర్‌లోనూ రెండు స్థానాలుండగా, ఒక్కో స్థానం నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఇదే తరహాలో ప్రాధాన్యతా ఓట్లను పరస్పరం వేసుకోవాలన్న అంతర్గ ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం.
 
ఖమ్మంలో మరో మహాకూటమి
ఇకపోతే, ఖమ్మం జిల్లాలో ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను పోటీ పెట్టకుండా అక్కడి నుంచి పోటీచేస్తున్న సీపీఐ (పువ్వాడ నాగేశ్వరరావు) కి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, టీడీపీలు కలిసి తమ ఓటర్లతో సీపీఐ అభ్యర్థికి వేయించడానికి క్యాంపులు కూడా నిర్వహించాయి. అక్కడ సీపీఎం కూడా సీపీఐ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది.
 
నల్గొండలో తలోదారి..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మారిన నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మిగిలిన పార్టీల ఓటర్లు ఎవరికి తోచిన దారిలో వారు నడుస్తున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ పోటీ చేయకపోగా ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు దాదాపు 90లో సగం మంది కాంగ్రెస్ వైపు మరో సగం మంది టీఆర్‌ఎస్‌వైపు మళ్లినట్టు తెలుస్తోంది. ఖమ్మంలో మద్దతు ఇస్తున్న కారణంగా సీపీఐ ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. సీపీఎం మాత్రం తటస్థ వైఖరితో ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించింది.
 
ఆ ఒక్క ఓటు కీలకమవుతుందా?
నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), తేరా చిన్నపరెడ్డి (టీఆర్‌ఎస్) మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ ఫలితంపైనే ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడానే ఉంటుందని అంటున్నారు. నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధులు 1262 (ఓటర్లు) ఉండగా వీరిలో కాంగ్రెస్‌కు చెందిన మేళ్లచెరువు మండలం వెల్లటూరు ఎంపీటీసీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆ ఒక్క ఓటు విషయంలో అంతా చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు