రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం

29 May, 2016 02:16 IST|Sakshi
రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం

సంఖ్యాబలం లేనందున పోటీవద్దని సీఎల్పీ నిర్ణయం

 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేయకూడదని కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్ణయించింది. గెలిచే బలం లేనందువల్ల పోటీచేసినా నష్టం తప్ప లాభంలేదని సీఎల్పీ ఈ నిర్ణయానికి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో వి.హనుమంతరావును అభ్యర్థిగా నిలబెట్టాలన్న టీపీసీసీ ప్రతిపాదనకు భిన్నంగా సీఎల్పీ ఈ నిర్ణయం తీసుకుం ది. శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలోని కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. రాజ్యసభ ఎన్నికలపై పార్టీ వైఖరి,  పాలేరు ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించినట్టు జానారెడ్డి మీడియాకు వెల్లడించారు.

రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సంఖ్యాబలం లేనందువల్ల పోటీపడడం లేదన్నారు. పోటీలో నిలిచి రాజకీయాలను కలుషితం చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జానారెడ్డి వెల్లడించా రు.  శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపడానికోసం జూన్ 2న ప్రతీ మండల, నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.

కాగా, మీడియాతో ఆచితూచి, సంయమనంతో మాట్లాడాలని ఈ సమావేశంలో జానా రెడ్డి నేతలకు సూచనలు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా ఎంపీలు వి.హన్మంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మాటలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉంటున్నాయని జానారెడ్డి వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. దీనికి పాల్వాయి స్పందిస్తూ పార్టీకి నష్టం చేయకుండా ఎలా మాట్లాడాలో తమకు తెలుసునని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

>
మరిన్ని వార్తలు