నగరం మునుగుతుంటే.. ఆయన ఢిల్లీలోనా: షబ్బీర్‌ అలీ

24 Sep, 2016 03:29 IST|Sakshi
నగరం మునుగుతుంటే.. ఆయన ఢిల్లీలోనా: షబ్బీర్‌ అలీ
హైదరాబాద్: భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అవుతుంటే.. అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం విడ్డూరమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఎద్దేవా చేశారు. నగరంలోని నిజాంపేట బండారి లేఅవుట్ వాసులు నాలుగు రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకుండా అంధకారంలో ఉంటే పట్టించుకునే నాధులే కరువయ్యారన్నారు. కనీస అవసరాలైన పాలు, మందులు, మంచినీళ్లు లేక.. పాముల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
 
కేసీఆర్ గద్దెనెక్కి రెండున్నరేళ్లు అయినా.. ఇంకా గత ప్రభుత్వాలు, గత పాలకులు అంటూ తమాషాలు చేస్తున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ స్థానాలను పెంచుకునేందుకు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్న కేసీఆర్ వెంటనే నగరానికి వచ్చి వరద పరిస్థితిని సమీక్షించాలన్నారు. రోమ్ నగరం తలపడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు నగరం నీట మునిగిపోతుంటే.. సీఎం ఢీల్లీలో కూర్చోవడాన్ని తప్పుపట్టారు.
 
తక్షణమే కేసీఆర్ హైదరాబాద్ వచ్చి పరిస్థితిని సమీక్షించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో వరద పరిస్థతికి గత ప్రభుత్వాలే కారణం అంటూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రి కేటీఆర్ యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ స్థానిక నేతలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని, హెల్ప్‌లైన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
 
మరిన్ని వార్తలు