ఖమ్మంలో కొత్త ‘రాజకీయం’

22 Mar, 2019 02:32 IST|Sakshi

నామా టీఆర్‌ఎస్‌లో చేరికతో ఉప్పూ నిప్పూ ఒకే దరికి

అటు తుమ్మల, ఇటు పువ్వాడ ఇద్దరూ నామాకు రాజకీయ ప్రత్యర్థులే 

ఇప్పుడు వారితో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి

ఒకప్పుడు జలగం, తుమ్మల మధ్య వైరం.. ఇప్పుడు ఇద్దరూ టీఆర్‌ఎస్‌లోనే

రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్న ఖమ్మం లోక్‌సభ స్థానం

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం లోక్‌సభ రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార టీఆర్‌ఎస్‌లో చోటుచేసుకున్న పరిణామాలకు తోడు లోక్‌సభ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణలు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలంతా ఒకే గూటికి చేరుతుండటం, అంద రూ గులాబీ కండువాలు కప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు చేరిక ఖమ్మం గులాబీ దండు రాజకీయాన్ని అనూ హ్య మలుపు తిప్పింది. టీడీపీలో ఉన్నన్ని రోజులు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావులు బద్ధవిరోధులుగా పనిచేశారు. రెండు గ్రూపులు నిత్యం కలహాలతో కాలం వెళ్లబుచ్చేవి.

కానీ, ఇప్పు డు తుమ్మల, నామా ఒకే ఒరలో ఇమడాల్సిన పరిస్థితి. ఉప్పు, నిప్పులా టీడీపీ రాజకీయాలు చేసిన ఆ ఇద్దరు ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నీడలో మళ్లీ పనిచేయాల్సి వస్తోంది. ఇక ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా రాజకీయాల్లో నామాకు ప్రత్యర్థిగానే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ ఖమ్మం స్థానం నుంచి తలపడగా నామాపై పువ్వాడ గెలు పొందారు. ఇప్పుడు నామా టీఆర్‌ఎస్‌లో చేరడం, ఆ చేరిక కార్యక్రమానికి పువ్వాడ కూడా హాజరవడం గమనార్హం. ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తే గతం లో జలగం సోదరులకు, తుమ్మలకు మధ్య రాజకీయ వైరం ఉండేది. జలగం ప్రసాదరావు, వెంకట్రావులు తుమ్మలకు ప్రత్యర్థులుగా వ్యవహరించేవారు.

ప్రసాదరావు, వెంకట్రావులతో పాటు తుమ్మల కూడా ఇప్పటికే కారు ప్రయాణంలో రాజకీయాలు చేస్తున్నా రు. ఇక, పువ్వాడ అజయ్‌కుమార్‌పై వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు ప్రత్యర్థులు ఆయన పనిచేస్తున్న పార్టీలోనే చేరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అజయ్‌ అప్పటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాతి పరిణామాల్లో తుమ్మల ఎమ్మెల్సీగా ఎన్నికయి మంత్రి పదవి చేపట్టడంతో పాటు పాలేరు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌పై పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరి ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. 

తేలని కాంగ్రెస్‌ అభ్యర్థి 
సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం జరుగుతుందేమో అనే ఆలోచనతో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ టికెట్‌ కోసం కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు కూడా యత్నిస్తున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన పోట్ల నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామాను ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
 

మరిన్ని వార్తలు