హోదా అంశంపై కాంగ్రెస్ రెఫరెండం: రఘువీరా

12 Sep, 2016 14:22 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా టీడీపీ, బీజేపీ ద్రోహం చేశాయని ఏపీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన సాయం బోగస్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నవాటినే అమలు చేస్తామన్నారని, హోదా ఇవ్వలేమని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని కమిషన్ సభ్యులే స్పష్టం చేశారని రఘువీరా అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ రెఫరెండం చేపడుతుందని, ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రయాన్ని సేకరిస్తామని రఘువీరా తెలిపారు. త్వరలోనే తిరుపతి నుంచి రెఫరెండం ప్రారంభిస్తామన్నారు.

రాజధాని నిర్మాణంపై స్విస్ ఛాలెంజ్ విధానం, చీకటి జీవోలతో రైతులను వేధించడాన్ని తాము మొదటి నుంచి వ్యతిరేకించామని రఘువీరా అన్నారు. టెండర్లు పారదర్శకంగా ఉండాలని, కేర్కల్ కమిటీ కూడా స్విస్ ఛాలెంజ్ను వ్యతిరేకించిందని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల కోట్లు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రం ఏం ఇవ్వకపోయినా హర్షిస్తారా అని రఘువీరా సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు