కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఖరారు

2 Jan, 2016 01:09 IST|Sakshi
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఖరారు

 అభ్యర్థి పేరుపై ఆదివారం నిర్ణయం: ఉత్తమ్

 సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిందని, ఈ పేరును ప్రకటిం చాలా వద్దా అనే దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో తమతో కలసి వచ్చే పార్టీలతో పనిచేస్తామన్నారు. స్థానిక కార్యకర్తల అభిప్రాయాల మేరకు సెలక్ట్ అండ్ ఎలక్ట్ విధానంలో భాగంగా ఈ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నాలుగైదు రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని, సెటిలర్లు, ముస్లింలు అధికంగా ఉన్న డివిజన్లలో వారికే పోటీచేసే అవకాశం కల్పిస్తామన్నారు.

జీహేచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలను గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఉద్యోగ ప్రకటనలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరుగుతుండటంతో ముస్లింలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్ అమలు చేయలేదని, ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ను ఎంఐఎం ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నాయకులు భట్టి విక్రమార్క, నాగయ్య, వినోద్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వ ఆస్తులపై ఎన్నికల, రాజకీయ ప్రచారం నిర్వహించవద్దని ఎన్నికల సంఘం నిబంధనలున్నా వాటిని టీఆర్‌ఎస్ ఉల్లంఘిస్తోందన్నారు. ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకులు, డివిజన్ కమిటీ నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 4న గాంధీభవన్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న  ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 5న నగరంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, డివిజన్, బూత్ కమిటీల సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. 6న బూత్‌కమిటీలతో డివిజన్‌స్థాయి సమావేశాలు, 7న ఇంటింటి ప్రచారం ద్వారా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు.

మరిన్ని వార్తలు