ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలే!

18 Jan, 2017 02:42 IST|Sakshi
ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలే!

మైనారిటీ సంక్షేమంపై మండలి లఘు చర్చలో కాంగ్రెస్‌ ఫైర్‌
చేసిన పనుల కన్నా ప్రభుత్వానికి ప్రచారం ఎక్కువైందన్న షబ్బీర్‌ అలీ
మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్‌లో 25 శాతమే ఖర్చు పెట్టారని వెల్లడి
రానున్న బడ్జెట్‌ సమావేశాల్లోనే 12% రిజర్వేషన్  బిల్లు: మహమూద్‌ అలీ  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అల్ప సంఖ్యాక (మైనారిటీ) వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. ‘మైనారిటీల సంక్షేమం–ప్రభుత్వ కార్య క్రమాలు’ అంశంపై మంగళవారం శాసన మండలి లఘుచర్చ వాడీవేడిగా కొనసాగింది. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్‌ అలీ చర్చను ప్రారంభిస్తూ.. 20 ఏళ్ల సమైక్య పాలనలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,204 కోట్లు కేటాయించిందన్నారు. విపక్ష నేత షబ్బీర్‌ స్పందిస్తూ.. కేటాయించిన వాటిలో ఇప్పటివరకు 25 శాతం నిధులనే ఖర్చు చేసిందని ఆరోపించారు.

మరో రెండు నెలల్లో మిగిలిన నిధులన్నీ ఖర్చు చేయడం సాధ్యమే నా అని ప్రశ్నించారు. మైనార్టీ కార్పొరేషన్  ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుకూ రుణం అందలే దన్నారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్‌ అధికా రాలను కల్పిస్తామన్న ప్రభుత్వం, రెండున్న రేళ్లయినా హామీని నిలబెట్టుకోలేదన్నారు. మణికొండలో కబ్జా అయిన వక్ఫ్‌ల్యాండ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఉర్దూ ద్వితీయ భాష హామీ ఏమైంది?
రాష్ట్రంలో ఉర్దూను ద్వితీయ భాషగా చేస్తామ న్న ప్రభుత్వ హామీ నేటికీ అమలుకు నోచుకో లేదన్నారు. ఉర్దూ అకాడమీలో సిబ్బంది వేత నాలకు నిధులు మంజూరు చేయడం లేదన్నా రు. రాష్ట్రంలో ఇంతకు మునుపు 40 మైనారిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలుండగా, రాష్ట్ర ప్రభుత్వ చర్యల పుణ్యమాని 18 కళాశాలలు మూత పడ్డాయన్నారు. అజ్మీర్‌ దర్గా వద్ద తెలంగాణ భవన్  నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇంతవరకు భూమిని ఎందుకు కొనుగోలు చేయలేదో చెప్పాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్  కల్పిస్తామని హామీ ఇచ్చి 32 నెలలు దాటిందని, మైనార్టీలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని షబ్బీర్‌ అలీ విమర్శించారు.

దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగింపు: మహమూద్‌ అలీ
రానున్న బడ్జెట్‌ సమావేశాల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్  బిల్లును ప్రవేశపెడతామని మహమూద్‌ అలీ శాసన మండలిలో ప్రకటిం చారు. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతా నికి మించరాదనే నిబంధనను సడలించేందుకు తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా (45/94) చట్టం తెస్తామన్నారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామన్నారు. రాష్ట్రంలో దళిత క్రిష్టియన్లకు ఎస్సీహోదాను కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. క్రైస్తవులు చర్చిలను నిర్మించుకునేందుకు వీలుగా స్థానిక సంస్థల ద్వారానే అనుమతి పొందేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు.

హైదరాబాద్‌లో క్రిస్టియన్  భవన్  నిర్మించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. గతంలో 35 మంది ఉద్యోగులతో ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖను బలోపేతం చేసే దిశగా 80 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందన్నారు. మైనారిటీల కోసం ఈ ఏడాది 71 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఏడాది మరో 129 స్కూళ్లను ప్రారంభించబోతున్నామన్నారు. మొత్తం 200 పాఠశాలల్లో ఆడపిల్లలకు 100 పాఠశాలలను ప్రభుత్వం కేటాయించిందన్నారు.

ఆదేశాలే తప్ప నిధులివ్వట్లేదు: షబ్బీర్‌ అలీ ధ్వజం
రైతులకు డబ్బులు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలివ్వడంతో సరిపుచ్చుతోంది కానీ నిధులు విడుదల చేయడం లేదని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మండలి మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ ‘రాష్ట్రంలో నేటికీ ఎక్కడో ఒకచోట రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది’ అని ఆయన విమర్శించారు.

ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ ‘తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. సభలో కూడా రైతుల సమస్యలపై మంత్రులు ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవు. రైతులకు రుణాల మాఫీ, ఇన్ పుట్‌ సబ్సిడీ, విత్తనాల పంపిణీ సరిగా జరగడం లేదు’ అంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం నకిలీ రైతు ప్రభుత్వంగా, కాంట్రాక్ట్‌ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు