సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...

5 Nov, 2015 12:19 IST|Sakshi
సారిక ఈ మెయిల్ సారాంశం ఇదే...

హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక... తన తరఫు న్యాయవాది రెహానాకు 22 పేజీల ఈ మెయిల్ పంపింది. తనను మానసికంగా, శారీరకంగా హింసలను భరిస్తున్నానంటూ ఆమె ఈ మెయిల్‌లో పేర్కొంది. భర్త అనిల్ వ్యవహారాన్ని సారిక పూసగుచ్చినట్లు మెయిల్‌లో వివరించింది. ఈ మెయిల్ సారాంశం..ఇదే...

'ఇల్లు విడిచి వెళ్లాలంటూ పదే పదే అత్త, భర్త వేధించేవారు. తిట్లు అరుపులు, కేకలతో రోజు అత్త విరుచుకుపడేది. నా తల్లి ఇచ్చిన చీరను కూడా తీసుకోనివ్వలేదు. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. ఇంట్లో పనివాళ్లు, పరిచయస్తుల ముందే తిట్టేవారు. అనిల్‌కు వివాహేతర సంబంధాలున్నాయి. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వెళ్లిపోతాడో తెలియదు. కుటుంబం పట్ల కనీస బాధ్యత లేదు. ఎక్కడకు వెళ్లావని అడిగితే చాలు..భౌతిక దాడులకు దిగేవాడు. ఇంత జరుగుతున్నా...అత్తమామలు పట్టించుకునే వాళ్లు కాదు. వండుకోవడానికి కనీసం సరుకులు కూడా అనిల్ తెచ్చేవాడు కాదు. నేను, పిల్లలు చాలాసార్లు ఆకలితో అలమటించాం. పిల్లల స్కూల్ ఫీజులు, ఆస్పత్రి బిల్లులు కట్టేవాడు కాదు.

నా తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లలతో మాట్లాడేందుకు అనిల్ ఒప్పుకునేవాడు కాదు. నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపిద్దామా? అన్నదే అత్త, మామల ఆలోచన. పిల్లలు నేను హాల్‌లోనే ఉండేవాళ్లం. నిరంతరం వేధింపులకు గురి చేసేవారు. ఏమైనా అడిగితే ఇంటి నుంచి వెళ్లిపో అనేవారు. జీవితాన్ని త్యాగం చేయాలంటూ రాజయ్య కూడా అనేవారు. చాలామంది మహిళలు... భర్తలు, అత్తమామల కోసం జీవితాలను త్యాగం చేశారని రాజయ్య చెప్పేవారు. రాజయ్య మాటలకు చాలాసార్లు బాధపడ్డా. జీవితాన్ని ఇప్పటితో ముగించాలన్న ఆలోచన అనేకసార్లు వచ్చేది. ఈ షాక్, ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టేది.' అని సారిక పేర్కొంది.

మరిన్ని వార్తలు