న్యాయాధికారుల కేటాయింపులో కుట్ర

13 May, 2016 02:13 IST|Sakshi

న్యాయం చేయాలంటూ ఏసీజేకు తెలంగాణ న్యాయవాదుల వినతి
సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల్లో పెద్ద కుట్ర దాగి ఉందని హైకోర్టు తెలంగాణ న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీలు గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు నివేదించాయి. హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారని, ఈ విషయం తెలిసి కూడా వారిని తెలంగాణకే కేటాయిస్తూ ప్రాథమిక జాబితాను తయారు చేశారని వివరించారు.

ఈ జాబితాను న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్ కోర్ట్ మెజారిటీ అభిప్రాయం మేరకు రూపొందించినట్లు తెలిసిందని, మార్గదర్శకాలు ఉన్నప్పుడు వాటి ఆధారంగానే కేటాయింపులు ఉండాలే తప్ప మెజారిటీ ఆధారంగా కాదని వారు తెలిపారు. ఫుల్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులతో పోలిస్తే తెలంగాణ న్యాయమూర్తులు మైనారిటీ అని, ఈ విషయం తెలిసి కూడా కేటాయింపుల వ్యవహారాన్ని ఫుల్ కోర్టుకు నివేదించడం కుట్రేనని వారు ఏసీజేకు వివరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు, జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ న్యాయవాదులు ఏసీజేకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

 ఉపసంహరణకు ఆదేశాలివ్వండి
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన ప్రాథమిక జాబితాను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని జేఏసీ నేతలు ఏసీజేను కోరారు. కేటాయింపుల సందర్భంగా న్యాయాధికారులు తమ సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న సొంత ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేశారన్నారు. తెలంగాణలో జిల్లా జడ్జీల కేడర్ సంఖ్య 94 కాగా 95 మందిని తెలంగాణకు కేటాయించారని, ఇందులో 46 ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన వారు ఉన్నారని ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో జిల్లా జడ్జీల కేడర్‌లో 140 పోస్టులంటే 110 మందినే కేటాయించారని, ఇంకా 30 ఖాళీలున్నాయన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 31 మంది సీనియర్ సివిల్ జడ్జీలను, 53 మంది జూనియర్ సివిల్ జడ్జీలను తెలంగాణకు కేటాయించారని వివరించారు. దీని వల్ల తెలంగాణ న్యాయవాదులకు, న్యాయాధికారులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణకు చెందిన హైకోర్టు జడ్జి పోస్టులను ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారులు సొంత చేసుకునేందుకే ఈ కుట్ర జరిగిందని వారు వివరించారు. తమ అభ్యర్థనలను సావధానంగా విన్న ఏసీజే తమకు తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గండ్ర మోహనరావు, రాజేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం వారు ప్రాథమిక కేటాయింపుల జాబితాపై తమ అభ్యంతరాలను రిజిస్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్‌కు అందచేశారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా