‘భద్రాద్రి’కి పర్యావరణ వివాదం

3 Feb, 2016 03:33 IST|Sakshi
‘భద్రాద్రి’కి పర్యావరణ వివాదం


 పర్యావరణ అనుమతి లేకుండానే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులు చేపట్టడంపై కేంద్రం సీరియస్
 

  •  తమ శాస్త్రవేత్తతో తనిఖీ జరిపించిన కేంద్ర పర్యావరణ శాఖ
  •  ప్రాజెక్టు స్థలంలో పరిశీలన.. నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారణ
  •  చాలా వరకు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడి
  •  ప్లాంట్ నిర్మాణ స్థలానికి సమీపంలో చెరువు ఉందని గుర్తింపు
  •  జెన్‌కోపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి నివేదిక’

 
 సాక్షి, హైదరాబాద్: జెన్‌కో చేపట్టిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పర్యావరణ అనుమతుల వివాదంలో చిక్కుకుంది. పర్యావరణ అనుమతి లేకుండానే చకచకా ప్రాజెక్టు పనులు నిర్వహిస్తుండడంపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సీరియస్ అయింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో ఆ శాఖ శాస్త్రవేత్త పి.కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో తనిఖీ జరిపి నివేదిక సమర్పించారు. పర్యావరణ అనుమతి లేకుండా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ధ్రువీకరించారు. దీనికి సంబంధించి జెన్‌కోపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు.
 
కాలం చెల్లిన టెక్నాలజీతో..
ఖమ్మం జిల్లా మణుగూరు, పినపాక మండలాల్లోని రామానుజవరం, ఎద్దులబయ్యారం, సీతారామపురం గ్రామాల పరిధిలో 1,080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని జెన్‌కో చేపట్టింది. సబ్ క్రిటికల్ బాయిలర్ సాంకేతికతతో 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను నిర్మిస్తోంది. అయితే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీతో కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని కేంద్ర విద్యుత్ శాఖ గతంలోనే నిర్ణయించింది.
 
ఈ నేపథ్యంలో భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌ను ఆధునిక సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించాలని జెన్‌కోకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సూచించింది. లేకుంటే కేంద్ర విద్యుత్ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాలనే షరతు విధిస్తూ... గత జూన్ 23న ఈ ప్రాజెక్టు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్(టీవోఆర్)ను ఆమోదించింది. ఇంకా పర్యావరణ అనుమతి జారీ చేయలేదు కూడా. అయినప్పటికీ జెన్‌కో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో... ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ తమ శాస్త్రవేత్తతో తనిఖీ జరిపించింది. ఆయన ప్రాజెక్టు స్థలంలో పరిశీలన జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించారు.
 
నివేదికలో పేర్కొన్న పలు అంశాలు..
- గతేడాది అక్టోబర్ నుంచే భదాద్రి థర్మల్  విద్యుత్ ప్లాంట్ పనులను ప్రాజెక్టు యాజమాన్యం ప్రారంభించింది.
- తనిఖీ నిర్వహించిన సమయంలో ప్రాజెక్టు స్థలంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో కనిపించలేదు. కొంత మంది మాత్రం ప్రాజెక్టు సైట్‌తో పాటు యంత్ర సామగ్రి నిల్వ ఉంచే గోదాంలో కనిపించారు. అన్ని రకాల భారీ యంత్రాలు, వాహనాలు, వస్తు సామగ్రిని ప్రాజెక్టు స్థలం వద్ద నిల్వ ఉంచారు.
- మెయిన్ పవర్ హౌస్‌తో పాటు టౌన్‌షిప్‌కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మెయిన్ పవర్ హౌస్ వద్ద అంతర్గత రోడ్లు, సబ్‌స్టేషన్ వద్ద సివిల్ పనులు, సైట్ ఆఫీస్ నిర్మాణం, ఫౌండేషన్ పనులు, బాయిలర్ హౌస్, చిమ్నీ, స్విచ్‌యార్డు పనులు చకచకా జరుగుతున్నాయి.
- ప్రాజెక్టు స్విచ్‌యార్డు ఏరియాకు వెనుక భాగంలో మణుగూరు-ఏటూరునాగారం రోడ్డుకు సమాంతరంగా ఓ చెరువు గుర్తించాం. ఈ చెరువుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను గానీ, ఈ చెరువు భూముల వినియోగంపై కానీ ప్రాజెక్టు యాజమాన్యం ఎలాంటి సమాచారాన్ని తనిఖీ సమయంలో ఇవ్వలేకపోయింది. సమీప వ్యవసాయ భూమి నుంచి వస్తున్న నీటి ప్రవాహమే ఇదని ప్రాజెక్టు యాజమాన్యం చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. చెరువుతో పోల్చితే వ్యవసాయ భూములు లోతైన ప్రాంతంలో ఉన్నాయి, ఆ భూములు, చెరువుకు మధ్య మణుగూరు-ఏటూరునాగారం రోడ్డు అడ్డుగా ఉంది. ఈ అంశాన్ని కేంద్ర పర్యవరణ శాఖ పరిశీలించాలి.
- ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గు, నీటి కేటాయింపులు ఇంకా జరగలేదు.

మరిన్ని వార్తలు