సన్నధాన్యానికి గిట్టుబాటు ధర!

15 Dec, 2016 03:01 IST|Sakshi

-  రైస్‌ మిల్లర్లతో సివిల్‌ సప్లయ్‌ ఎంవోయూ
- మధ్యాహ్న భోజన పథకం అవసరాల కోసం సన్నబియ్యం
- క్వింటాల్‌ ధాన్యానికి రైతులకు రూ.1,800


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నడుం బిగించింది. కేంద్రం నిర్దేశించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను మించి రైతులకు గిట్టుబాటయ్యేలా చర్యలు తీసుకుంటోంది. రైతుల నుంచి క్వింటాలు సన్న ధాన్యాన్ని రూ.1,800కు తక్కువ కాకుండా కొనుగోలు చేసే మిల్లర్‌ నుంచి తాము సన్న బియ్యాన్ని క్వింటాలుకు రూ.3వేలు (ముడి బియ్యం), రూ.3,050 (బాయిల్డ్‌ రైస్‌) చొప్పున చెల్లించి కొంటామని సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియే షన్‌తో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కూడా చేసు కుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఏ’గ్రేడు ధాన్యానికి క్వింటాలుకు రూ.1,510, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1,470 కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. 

ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో సన్న ధాన్యాన్ని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు సివిల్‌ సప్లైస్‌ సంస్థ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరను మించి చెల్లించి కొనుగోలు చేసే అవకాశం లేదు. దీంతో మిల్లర్ల ద్వారానే ఆ ధాన్యం కొనుగోలు చేసేందుకు కార్పొరేషన్‌ ప్రణాళిక రూపొందించింది. కాగా, రాష్ట్రంలో పన్నెండు రకాల సన్నధాన్యం పండిస్తున్నప్పటికీ కేవలం మూడు రకాల సన్న ధాన్యానికి మాత్రమే మిల్లర్లకు అనుమతి ఇచ్చారు. బీపీటీ–5204, సోనా మసూరి, సాంబా మసూరి (విజయా మసూరి) రకం ధాన్యాన్ని ఆడించిన బియ్యాన్ని మాత్రమే కార్పొరేషన్‌ కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రైతుల మేలుకోసం..: కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది
పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నా, ఈ ఎంఓయూ ద్వారా సన్నరకం ధాన్యం పడించిన రైతులకు మరింత గిట్టుబాటు ధర లభి స్తుందని, తమ తో మిల్లర్లు చేసుకున్న ఎంఓయూకు వారు కట్టుబడి ఉండాలని కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుద ర్శన్‌రెడ్డి కోరారు. ఈ ఒప్పందం వల్ల రైతుల వద్ద ఉన్న ధాన్యానికి మంచి ధర లభించడంతోపాటు, రాష్ట్రం లోని హాస్టళ్లు, స్కూళ్ళలో మధ్యాహ్న భోజనానికి నాణ్య మైన మన బియ్యమే వాడుకోగలుగుతామని, దీంతో పాటు సన్న బియ్యానికి ఎక్కువ ధర చెల్లించి బయటి రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని, ఫలితంగా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు