రోడ్లపై జంటలు కనిపిస్తే పెళ్లిచేస్తాం: వీహెచ్‌పీ

9 Feb, 2015 23:40 IST|Sakshi
రోడ్లపై జంటలు కనిపిస్తే పెళ్లిచేస్తాం: వీహెచ్‌పీ

సుల్తాన్‌బజార్: వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన రోడ్లు, పార్కులలో కనిపించే ప్రేమజంటలకు పెళ్లిళ్లు చేస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్‌దళ్ నేతలు హెచ్చరించారు. సోమవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ వై.భానుప్రకాశ్, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు మాట్లాడారు. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే వాలెంటైన్స్ డేను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. కొన్ని మల్టీనేషన ల్ సంస్థలు తమ వ్యాపారాభివృద్ధికి చేస్తున్న కుట్రలో భాగమేవాలెంటైన్స్ డే వేడుకలని అన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు.

14న జరిగే నిరసన కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్, ఎఫ్‌ఎం రేడియోలు, వ్యాపారులు దీనిని ప్రోత్సహించవద్దని కోరారు. ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను దింపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వెంకటేశ్వరరాజు, మీడియా ఇన్‌చార్జి భరత్‌వంశీ, ఎం.సుభాష్‌చందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దీని కోసం రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
 

మరిన్ని వార్తలు