సాక్షి డైరెక్టర్లకు హైకోర్టులో ఊరట

26 Apr, 2016 22:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత పరిధిలో అధికార పార్టీ నాయకుల భూ అక్రమాలపై 'సాక్షి' ప్రచురించిన కథనాలు తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ హైకోర్టు నిలిపేసింది. ప్రతివాదులుగా ఉన్న నరేంద్రకుమార్, గుంటూరు జిల్లా పోలీసులకు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని ప్రాంత పరిధిలో అధికార పార్టీ నాయకులు భారీ భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ పూర్తిస్థాయి ఆధారాలతో సహా 'సాక్షి' ఇటీవల సంచలనాత్మక కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్ పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్లు యర్రంరెడ్డి ఈశ్వర్ ప్రసాదరెడ్డి, కాల్వ రాజప్రసాదరెడ్డి, పి.వెంకటకృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టేయాలని, అప్పటివరకు ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ మంగళవారం విచారించారు.

పిటిషనర్ల తరఫున జి.కళ్యాణి వాదనలు వినిపిస్తూ, వాస్తవాలను నిర్ధారించుకున్న తరువాతే కథనాలను ప్రచురించారన్నారు. పత్రిక రోజూ వారి వ్యాపారాలతో కంపెనీ డెరైక్టర్లకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. సాక్షి కథనాలకూ దాని డెరెక్టర్లకు ఏం సంబంధం లేదని, ఈ విషయం తెలిసి కూడా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నరేంద్రకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పొన్నూరు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు