వైద్యులకు ‘క్రెడిట్’ గంటలు!

7 Sep, 2014 23:59 IST|Sakshi
వైద్యులకు ‘క్రెడిట్’ గంటలు!

* ఐదేళ్లలో కనీసం 30 గంటలు ఉండాలి
* లేదంటే రిజిస్ట్రేషన్, రెన్యువల్ కుదరదు
* భారతీయ వైద్య మండలి సరికొత్త నిబంధన
* డాక్టర్ల వృత్తి నైపుణ్యం పెరగాలనే: ఎంసీఐ


సాక్షి, హైదరాబాద్: రోజుకో కొత్త రోగాలు పుట్టుకొస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్యులు వృత్తి కౌశలాన్ని పెంపొందించుకునేలా భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) చర్యలు చేపట్టింది. మారుతున్న పరిస్థితులతోపాటు వైద్యులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఇకనుంచి ప్రతి వైద్యుడూతన ప్రతిభను గుర్తించే పని గంటలను(క్రెడిట్ అవర్స్) నిర్దేశిస్తూ ఎంసీఐ నిబంధన విధించింది.
 
వైద్య వృత్తిలో వస్తున్న మార్పులు, ఆధునిక పద్ధతులు, పరిశోధనలపై వైద్యులు నైపుణ్యం పెంచుకోవడానికి క్రెడిట్ అవర్స్ తప్పనిసరి చేసింది.ఈ విధానం వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా అమలు కానుంది. అమెరికా, ఐరోపాలో ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో కలిపి సుమారు 80 వేల మంది డాక్టర్లు ఉన్నట్టు అంచనా. వీరంతా క్రెడిట్ అవర్స్ సొంతం చేసుకుంటేనే వైద్యం చేసేందుకు వీలుంటుంది. సరైన క్రెడిట్ అవర్స్ లేకుంటే రిజిస్ట్రేషన్, రెన్యువల్‌కు అవకాశం ఉండదు. అందరు డాక్టర్లకూ ఇది వర్తిస్తుంది.
 
ఇక ఐదేళ్లకోసారి రెన్యువల్ తప్పనిసరి

వైద్యులు ఇప్పటివరకు ఒక్కసారి ఎంసీఐలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. అదనపు డిగ్రీ పొందినప్పుడు మాత్రం ఆ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇకపై అలా కుదరదు. ప్రతి ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రెన్యువల్ చేయించుకోవాల్సిందే. 30 గంటల క్రెడిట్ అవర్స్ చూపకుంటే రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు అనుమతించరు. ఎంసీఐ రెన్యువల్ చేయకుంటే వైద్యుడు ప్రాక్టీస్ చేయటం, కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయటానికి అనుమతించరు. సదస్సులు, సెమినార్లకు హాజరు కావడం, రీసెర్చ్ పేపర్లు, థీసిస్‌లు రూపొందించటం ద్వారా వైద్యులకు వైద్య విధానాలపై సరైన అవగాహన ఉంటుందని ఎంసీఐ చెబుతోంది.
 
క్రెడిట్ అవర్స్ అంటే?
ఎంసీఐ నిబంధనల ప్రకారం క్రెడిట్ అవర్స్ అంటే వైద్య పట్టా పుచ్చుకున్న ప్రతి డాక్టర్ తన వృత్తిలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిణితి సాధించడం. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లలో పాల్గొనటం ద్వారా వీటిని సాధించవచ్చు. థీసిస్‌లు, రీసెర్చ్ పేపర్లు, జర్నల్స్ సమర్పించటం ద్వారా కూడా లభిస్తారుు. ప్రతి వైద్యుడూ రిజిస్ట్రేషన్ చేసుకునే నాటికి , రెన్యువల్ చేసుకునే నాటికి నిర్దేశిత క్రెడిట్ అవర్స్ పొంది ఉండాలి. లేదంటే ఆ రిజిస్ట్రేషన్‌ను ఆమోదించరు.
 
సాధించటం ఎలా?
డాక్టర్లు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లలో పాల్గొని తమ వంతు పాత్ర పోషిస్తే క్రెడిట్ అవర్స్ లభిస్తాయి.
సెమినార్ లేదా సదస్సు కచ్చితంగా 8 గంటల పాటు నిర్వహించాలి. ఎనిమిది గంటలు డాక్టరు పాల్గొంటే 4 క్రెడిట్ అవర్స్ ఇస్తారు.  
*  ఎంసీఐ అనుమతి ఇస్తుంది. సదస్సు తీరుపై పరిశీలన చేసి క్రెడిట్ అవర్స్ నిర్ణయిస్తుంది.
* అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లకు ఒక్కో సదస్సుకు రెండు క్రెడిట్ అవర్స్ ఇస్తారు
* థీసిస్‌లు, రీసెర్చ్ పేపర్లు,  జర్నల్స్‌లో పబ్లికేషన్లకూ ఈ గంటలు వర్తిస్తాయి. వీటి స్థాయిని బట్టి క్రెడిట్ అవర్స్ నిర్ణరుుస్తారు.
* పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య పూర్తిచేసిన ప్రతి వైద్యుడికీ ఏడాదికి 4 గంటల క్రెడిట్ అవర్స్‌ను ఉచితంగా ఇస్తారు. వీరు నిరంతర పాఠ్యాంశాలు, కొత్త వైద్యవిధాన పద్ధతులు అనుసరిస్తున్నందున ఈ సౌకర్యం కల్పించారు.
* కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ఎవరికైనా క్రెడిట్ అవర్స్ నిబంధన వర్తిస్తుంది.
*  ప్రతి వైద్యుడు ఐదేళ్లలో 30 క్రెడిట్ అవర్స్‌ను కచ్చితంగా సొంతం చేసుకోవాలి.

మరిన్ని వార్తలు