విద్యార్థులపైనా క్రిమినల్ కేసులు

30 Jul, 2016 18:43 IST|Sakshi

సంచలనం సృష్టించిన ఎంసెట్-2 లీకేజి కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితుడు రాజగోపాలరెడ్డి (65)తో పాటు ఎల్బీనగర్ ప్రాంతంలో రెజొనెన్స్ అకాడమీని నడుపుతున్న వెంకటరామయ్య అలియాస్ వెంకటరమణను కూడా సీఐడీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. కొంతమంది విద్యార్థులపై కూడా క్రిమినల్ కేసులు నమోదుచేసే అవకాశం కనిపిస్తోంది. కొందరు విద్యార్థులు తమ అకౌంట్ల నుంచి ఏకంగా 50 లక్షల వరకు కూడా లావాదేవీలు చేసిన వ్యవహారాన్ని సీఐడీ త్వరలో బయటపెట్టబోతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిలో చాలామంది విద్యార్థులు పరారీలో ఉన్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ కేసులో ముందుగా తిరుమల్, విష్ణు అరెస్టయ్యారు. తర్వాత రమేష్, బండారు రవీంద్ర అనే ఇద్దరిని సీఐడీ అరెస్టుచేసింది. తాజాగా కీలక నిందితులు ఇద్దరు దొరికారు. వీళ్లలో వెంకటరామయ్య అలియాస్ వెంకటరమణ రెజొనెన్స్ అకాడమీకి పీఆర్వోనని మాత్రమే తొలుత చెప్పాడు. కానీ అతడే యజమాని అని సీఐడీ చెబుతోంది. విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఇతడు ఎంసెట్ మెడికల్ అకాడమీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బండారు రవీంద్ర అనే వ‍్యక్తి రమేష్కు సహకరించాడు. ఇతడు మెడికల్ అకాడమీ మెస్ ఇంచార్జిగా పనిచేస్తున్నాడు. అకాడమీ నుంచి నలుగురు విద్యార్థులను పుణె క్యాంపునకు రవీంద్ర, వెంకటరమణ కలిసి పంపారు. విద్యార్థుల నుంచి వీరు మొత్తం రూ. 35 లక్షలు వసూలుచేశారు. ఆ డబ్బును రవీంద్ర, వెంకటరమణ కలిసి రమేష్కు ఇచ్చారు. బ్రోకర్ విష్ణు పంపిన 14 మందితోపాటు విజయవాడకు చెందిన జ్యోతిబాబు పంపిన ఆరుగురు విద్యార్థులకు కూడా పేపర్ లీక్ చేశారు. మొత్తం విద్యార్థులందరి వద్ద నుంచి కలిపి రాజగోపాల్ రెడ్డి రూ. 1.25 కోట్లు వసూలు చేశాడు. విద్యార్థులను పంపిన బ్రోకర్లకు కూడా అతడు బాగానే ముట్టజెప్పాడు.

కింగ్పిన్ ఎవరు?
తెలంగాణ ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజి కేసులో అసలైన కింగ్పిన్ మాత్రం ఇంతవరకు దొరకలేదు. రాజగోపాలరెడ్డి కీలక నిందితుడని భావిస్తున్నా.. అతడు కూడా ఒక బ్రోకర్ మాత్రమేనని సీఐడీ నమ్ముతోంది. ఈ మొత్తం కేసుకు అనేక రాష్ట్రాలతో సంబంధం ఉంది. చెన్నై సహా చాలా నగరాలకు విద్యార్థులను తరలించినట్లు చెబుతున్నారు. దీంతో మొత్తం వివరాలన్నీ సమగ్రంగా తెలియాలంటే కింగ్పిన్ ఎవరో తెలియాలని, అతడు దొరికితేనే అసలు ఎంతమందికి పేపర్ లీకైంది.. ఈ కుంభకోణంలో ఎంతమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర ఉందనే విషయాలు తెలుస్తాయి.

మరిన్ని వార్తలు