పంట రుణ లక్ష్యం రూ.46 వేల కోట్లు

31 Jan, 2018 01:56 IST|Sakshi

నాబార్డు 2018–19 రుణ విధాన పత్రం విడుదల

అన్ని రంగాలకు కలిపి రుణాలు రూ.83,388 కోట్లు

బ్యాంకర్లు రైతుల పాస్‌ పుస్తకాలు ఇచ్చేయాలి: హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రైతులకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.46,344.61 కోట్ల మేర పంట రుణాలు అందజేయాలని నాబార్డు లక్ష్యంగా నిర్దేశించింది. మొత్తంగా అన్ని రంగాలకు కలిపి గతేడాది కంటే 17 శాతం అధికంగా రూ. 83,388.87 కోట్ల రుణాలు అందజేయాలని నిర్ణయించింది.

పంట రుణాలకు అదనంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశు సంవర్థక రంగాలకు అదనంగా రుణాలివ్వాలని.. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 2,667 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. విద్యా రుణాలకు రూ. 1,206 కోట్లు, గృహ రుణాలకు రూ.3,759 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. నాబార్డు రూపొందించిన ‘2018–19 రుణ విధాన పత్రాన్ని  హరీశ్‌రావు మంగళవారం విడుదల చేశారు.

జూన్‌ నాటికే పంట రుణాలివ్వాలి.
బ్యాంకులు తమ వద్ద తనఖాగా పెట్టుకున్న పాస్‌ పుస్తకాలను రైతులకు తిరిగి ఇచ్చేయాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇక ముందు పంట రుణాలు తీసుకోవడానికి పాస్‌ పుస్తకాలు అవసరం లేదు. రైతుల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. బ్యాంకులు పరిశీలన పేరుతో పాస్‌ పుస్తకాలు తీసుకుని.. ఇప్పటికీ ఇవ్వలేదు. పాస్‌ పుస్తకాలను తిరిగి వెనక్కి ఇచ్చేలా నాబార్డు ఆదేశాలు జారీచేయాలి’’అని కోరారు.

బ్యాంకర్లు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు మే– జూన్‌ నెలల్లోనే లక్ష్యం మేరకు పంట రుణాలు అందజేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోందన్నారు. కోల్డ్‌ స్టోరేజీలకు నాబార్డు రుణం అందజేయా లని కోరారు. ప్రభుత్వం ఎన్నికల కోసమే రైతులకు పెట్టుబడి సాయం వంటివి ఇస్తోందన్న ఆరోపణలు సరికాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

దేశంలో 73 శాతం సంపద ఒక శాతం మంది చేతిలో ఉండటం మంచి పరిణామం కాదని.. సంపద అందరికీ చేరాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్‌ ఆర్‌.సుబ్రమణ్యన్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ మణికందన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు