రాష్ట్ర రుణాల్లో సగం పంట రుణాలే

21 Jan, 2017 00:47 IST|Sakshi
  • 2017–18 రుణ ప్రణాళిక విడుదల చేసిన నాబార్డు
  • మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 65,590 కోట్లు
  • అందులో వ్యవసాయ రుణాలు రూ. 32,830 కోట్లు
  • సాక్షి, హైదరాబాద్‌: 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలపై నాబార్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రుణాల్లో సగ భాగం పంట రుణాలకే కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్‌ పేపర్‌ను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ. 65,590.61 కోట్లుగా నాబార్డు అంచనా వేసింది. 2016–17తో పోలిస్తే 17 శాతం రుణాలు అధికమని స్పష్టం చేసింది. అందులో వ్యవసాయ పంట రుణాలే ఏకంగా సగం ఉండటం గమనార్హం. మొత్తం రుణ ప్రణాళికలో పంట రుణాలు రూ. 32,830.44 కోట్లుగా నిర్ధారించింది. దీర్ఘకాలిక, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ. 14,116 కోట్లుగా నాబార్డు పేర్కొంది. ఈ రెండూ కలిపి వ్యవసాయ పంట, దీర్ఘకాలిక అనుబంధ రుణాలన్నీ రూ.46,946.98 కోట్లుగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఈ రుణ ప్రణాళిక తయారు చేసినట్లు నాబార్డు వెల్లడించింది. చేపల పెంపకం, ఉద్యాన, పశు సంవర్ధకశాఖల అభివృద్ధి ప్రాధాన్యాలుగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది.

    వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2,088 కోట్లు
    దీర్ఘకాలిక, వ్యవసాయ అనుబంధ రుణాలకు రూ. 14,116 కోట్లు కేటాయించగా... అందులో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు రూ.2,087.67 కోట్లు కేటాయించింది. పశుసంవర్ధకశాఖలో భాగమైన డెయిరీ అభివృద్ధి కోసం రూ. 1737.59 కోట్లు కేటాయించింది. కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 647.17 కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయించింది. గోదాములు, మార్కెట్‌ యార్డుల కోసం రూ.801.89 కోట్లు రుణంగా ప్రకటించింది.

    గృహ రుణాలకు రూ. 3,577 కోట్లు
    గృహ రుణాలకు రూ. 3,577.57 కోట్లు కేటాయించాలని నాబార్డు నిర్ణయించింది. విద్యా రుణాల కోసం రూ.1661.64 కోట్లు లక్ష్యంగా ప్రకటించింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ. 9,241.24 కోట్లు రుణాలు ఇవ్వాలని వెల్లడించింది.

    2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు దిశగా...
    కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా తన రుణ ప్రణాళిక లక్ష్యం ఉందని నాబార్డు వెల్లడించింది. అందుకు అనుగుణంగా రుణ ప్రణాళిక తీర్చిదిద్దినట్లు వివరించింది.

మరిన్ని వార్తలు