సుప్రీం విచారణ నేపథ్యంలోనే హడావుడి నిర్ణయం

3 Jul, 2016 01:59 IST|Sakshi
సుప్రీం విచారణ నేపథ్యంలోనే హడావుడి నిర్ణయం

ఫిరాయింపు పిటిషన్ల డిస్మిస్‌పై వైఎస్సార్ సీపీ
 
 సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ టికెట్‌పై గెలుపొంది టీడీపీలోకి బాహాటంగా, మీడియా సమక్షంలోనే ఫిరాయించిన 13 మంది ఎమ్మెల్యేలపై తాము ఇచ్చిన పిటిషన్లను సాంకేతిక కారణాలతో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. స్పీకర్ తిరస్కరణ నిర్ణయం వెలువడిన తరువాత ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. చట్టసభలకు ఒక పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు రాజకీయ ఫిరాయింపులకు పాల్పడటమనే అనైతిక కార్యకలాపాలను నిరోధించడంతో పాటు, పడిపోతున్న ప్రజాస్వామ్య విలువలను కాపాడటం అనేది రాజ్యాంగంలోని పదో షెడ్యూలు స్ఫూర్తి అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ తరపున గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించామనే అంశాన్ని ఈ 13 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ నిరాకరించలేదన్నారు. ఈ ఎమ్మెల్యేలు తమ ఫిరాయింపును గోప్యంగా ఏమీ ఉంచలేదని, టీడీపీ కార్యక్రమాలన్నింటి కీ హాజరవుతున్నారని పేర్కొన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతూ ఉంటే చాలా కాలం క్రితమే ఈ 13 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా చేసి ఉండాలన్నారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలని సుప్రీంకోర్టులో తాము వేసిన పిటిషన్ ఈ నెల 8వ తేదీన విచారణకు వస్తున్నందున స్పీకర్ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ విమర్శించింది. ఈ పిటిషన్లపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, తన వైపు ఎలాంటి నిర్ణయం పెండింగ్‌లో లేదని తన తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో నివేదించడం కోసమే స్పీకర్ ఇలా చేశారన్నారు.

స్పీకర్ పదవిలో ఉన్న వారు ఒక క్వాసీ-జ్యుడిషియల్ ట్రిబ్యునల్ లాంటి వారు కనుక ఒక న్యాయమూర్తి అనుసరించే అన్ని విధి, విధానాలు పాటించి తీరాలని సుప్రీంకోర్టు గతంలో కొన్ని తీర్పులు ఇచ్చిన విషయాన్ని పార్టీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి అనర్హత పిటిషన్లపై న్యాయనిర్ణయం చేసేటపుడు కూడా స్పీకర్ ఇదే విధానాన్ని పాటించాలని పేర్కొంది. సాంకేతిక కారణాల సాకుతో అనర్హత పిటిషన్లను తిరస్కరించే సమయంలో తన నిర్ణయాన్ని మీడియా ముందు కాకుండా ఫిర్యాదుదారులను పిలిచి, వారి వాదనకు ఒక అవకాశం ఇచ్చి, వారు చెప్పేదేమిటో కూడా విని ఉండాల్సింద ని అభిప్రాయపడింది. న్యాయపరమైన ఈ విధానాన్ని పాటించాల్సి ఉండగా అలాంటిది చేయక పోవడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. స్పీకర్ నిర్ణయం తాలూకు ఆదేశాల కాపీని (ఆర్డర్) అధ్యయనం చేసిన తరువాత తదుపరి చర్యలు చేపడతామని పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు