ఆఫీసులు, ఉద్యోగుల వివరాలివ్వండి

19 Oct, 2016 04:00 IST|Sakshi

కొత్త కలెక్టర్లతో సీఎస్ తొలి వీడియో కాన్ఫరెన్స్

 సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో ప్రభుత్వ విభాగాలు, ఉద్యోగుల వివరాలను కలెక్టర్లు వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఎన్ని శాఖల కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఎంతమంది ఉద్యోగులు రిపోర్టు చేశారు. కార్యాలయాలకు ఎన్ని భవనాలు స్వాధీనం చేసుకున్నారు.. అనే వివరాలను వెంటనే పంపించాలని సూచించారు. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సీఎస్ రాజీవ్‌శర్మ 31 జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించి ఎంతమంది సిబ్బంది విధుల్లో చేరారనే వివరాలను ఆరా తీశారు.

కొత్త కార్యాలయాల నుంచి పరిపాలనాపరమైన స్థితిగతులు, పీడీ ఖాతాలు, భవనాల స్వాధీనం తదితర అంశాలను కొత్త కలెక్టర్లను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా  కలెక్టరేట్ల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించడంపై దృష్టి సారించాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు, సూచనలను నిర్దేశిత నమూనాలో ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. పీడీ ఖాతాలు తెరిచే విషయంలో మరింత వివరణ కావాలని, కొన్ని జిల్లాల కలెక్టర్లు కోరడంతో రెండు, మూడు రోజుల్లో సవివరమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎస్ తెలిపారు.

రాష్ట్రంలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్లు తెలిపారు. దీని మార్గదర్శకాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తామని ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తెలిపారు. అన్ని జిల్లాల్లో హరితహారం అమలును సీఎస్ సమీక్షించారు. వర్షాకాలం ముగుస్తున్నందున ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే ఏడాదికి సంబంధించి హరితహారం ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో కూడా మైక్రోప్లానింగ్ తయారు చేసుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకంతో సమన్వయం చేసుకొని జియో ట్యాగింగ్, వెబ్‌సైట్‌లో అప్‌లోడింగ్ చేయాలని అన్నారు.

మరిన్ని వార్తలు